ఔను.. తెలంగాణలో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. ఒకప్పుడు శాసించిన నియోజకవర్గాలు.. జిల్లాల్లో కమ్యూనిస్టుల పరిస్థితి అర్ధించే స్థాయికి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. గత రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలు భిన్నమైన రీతిలో జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పాయింట్ మెంట్ కోసం.. కామ్రెడ్లు ఎదురు చూస్తున్నారు. మరో మూడు నాలుగు మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ పరిస్థితిని తేల్చాలని వారు కోరుతున్నారు.
టికెట్ల విషయానికి వస్తే.. ఈ విషయంలో కేసీఆర్ కూడా తొందరగానే తేల్చేయాలని భావిస్తున్నారు. అయితే, ఆచితూచి మాత్రమే ఆయన వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు అయితే.. కమ్యూనిస్టుల కు రెండు స్థానాలు మాత్రమే ఇస్తామని వర్తమానం పంపించారు. వాస్తవానికి 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి కూడా ఏనాడూ కేసీఆర్ వారివైపు చూడలేదు. పైగా కమ్యూనిస్టులను డైల్యూట్ చేయడానికే ఆయన ప్రయత్నించారు. కామ్రెడ్ నోముల నరసింహయ్యను పార్టీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే.. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కుంజర యూధంబు అన్నట్టుగా కేసీఆర్ కమ్యూనిస్టులను సాయం కోరారు. దీంతో కమ్యూనిస్టులు .. మాకది-మీకిది తరహాలో మునుగోడు ఉప పోరులో కేసీఆర్ తరఫున శక్తివంచన లేకుండా కృషి చేసి గెలిపించారు. ఇక, ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. అప్పటి విషయాలు మరిచిపోయారా? లేక కమ్యూనిస్టుల బలం ఇంతేనని నిర్ధారించుకున్నరో తెలియదు కానీ.. వారికి(సీపీఐ), సీపీఎంలకు చెరో సీటు ఇస్తామన్నారు.
కానీ, వాస్తవానికి సీపీఐ, సీపీఎంలను గమనిస్తే.. క్షేత్రస్థాయిలో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ వంటి జిల్లాల్లో పట్టుంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే.. బలమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. కానీ, కొన్ని కొన్ని కారణాలతో కమ్యూనిస్టులు ఇతర పార్టీలవైపు మొగ్గు చూపడం.. పార్టీ పరంగా ఉద్యమిస్తున్నా.. విధానాల పరంగా ప్రజలకు చేరువ కాలేక పొవడం వంటి కారణాలో వాసి-రాసిలో కమ్యూనిస్టులు కొంత వెనుకబడ్డారు.
ఇక, ఇప్పుడు వారే కేసీఆర్ వెంటబడి.. కనీసం మూడేసి టికెట్లు అయినా తమకు కేటాయించాలని కామ్రెడ్స్ పట్టుబడుతున్నారు. వీటిలో సీపీఐ బెల్లంపల్లి, కొత్తగూడెం, మునుగోడు నియోజకవర్గాలు కావాలని పట్టుబడుతోంది. ఇక, సీపీఎం మిర్యాలగూడ, పాలేరు, భద్రాచలం నియోజకవర్గాలను తమకు కేటాయించాలని కోరుతున్నాయి. వాస్తవానికి ఆయా నియోజకవర్గాలే కాదు.. జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నా.. ఒకప్పుడు బాగానే ఉన్న పరిస్తితి.. ఇప్పుడు అర్థించే స్థాయికి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.