ఏపీ బీజేపీకి అధ్యక్షురాలిని నియమించినా, కార్యవర్గాన్ని మార్చినా, జాతీయ స్థాయిలో ఏపీ ఇన్చార్జిలను మార్చినా ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే మార్చాల్సింది నేతలను కాదన్న విషయాన్ని కేంద్ర నాయకత్వం గమనించటం లేదు. అసలు మారాల్సిందే నరేంద్ర మోడీ వైఖరి. ఏపీ విషయంలో మోడీ వైఖరి మారనంత వరకు అధ్యక్ష స్థానంలో ఎవరున్నా, ఎన్ని కార్యవర్గాలను మార్చినా, ఇన్చార్జిలుగా ఎవరిని నియమించినా ఎలాంటి ఉపయోగముండదు. చేయాల్సిన డ్యామేజంతా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరుగుతు పార్టీని రిపేర్లు చేయమంటే ఎలా సాధ్యం.
పార్టీ అధ్యక్ష బాధ్యతలను సోమువీర్రాజును తప్పించి దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగిస్తే ఏమవుతుంది ? ఆమేమీ ప్రజాకర్షక నేత కాదు, పోనీ తమ సామాజికవర్గంపై తిరుగులేని పట్టుందా అంటే అదీలేదు. కాబట్టి పురందేశ్వరి పార్టీ బలోపేతానికి చేయగలిగిందేమీ లేదు. ఇక జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ ను కంటిన్యూ చేయాలని చేస్తున్నారు. ఆయన వల్ల కూడా పార్టీకి ఓట్ల సాధనలో ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే ఈయనకు పార్టీలోనే పట్టులేదు. మామూలు జనాలకు ఈయనెవరో కూడా తెలీదు.
2014 లో విభజన తర్వాత బాధ్యతలు తీసుకున్న నరేంద్రమోడీ విభజన హామీలను అమలు చేసుంటే పార్టీకి ఎంతోకొంత మైలేజీ వచ్చుండేది. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందని, విభజన హామీలను అమలుచేస్తోందన్న కారణంగా జనాలు కూడా బీజేపీకి మద్దతిచ్చేవారేమో. కానీ అలాచేయకుండా మోడీ రివర్సులో వ్యవహరించారు. విభజన హామీలను తుంగలో తొక్కేశారు. అడుగడుగునా ఏపీ ప్రయోజనాలను దెబ్బ కొడుతునే ఉన్నారు. అలాంటపుడు బీజేపీని జనాలు ఎందుకు ఆదరించాలి ?
అందుకనే ఏ ఎన్నిక జరిగినా కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వటం లేదు. జనాలు మొత్తం పార్టీపైన మండుతున్నపుడు అద్యక్షులను మార్చినా, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేసినా, ఇన్చార్జిలను కొత్తవారిని నియమించినా ఎలాంటి ఉపయోగముండదని మోడీ గ్రహించాలి. తప్పులన్నీ తనలోనే పెట్టుకుని ఎదుటి వాళ్ళు సరిగా పనిచేయటంలేదని, పార్టీని బలోపేతం చేయటంలేదని ఆగ్రహిస్తే ఉపయోగమేమిటి ? అందుకనే బీజేపీకి రాష్ట్రంలో ఏ మూలకూడా ఆదరణ దక్కటంలేదు. ఇపుడు తప్పులు దిద్దుకున్నా రిపేర్లు చేయటానికి కూడా పనికిరాని వాహనం లాగ తయారైపోయింది బీజేపీ పరిస్ధితి. మరిలాగే కొంతకాలం పాటు లాక్కుని రాకతప్పదు.