మరో ఎనిమిది మాసాల్లో ఎన్నికలు జరగనున్న ఏపీపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. అనేక మంది అనేక రూపాల్లో తమ తమ సర్వేలు వివరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నాయకుడు రఘురామకృష్ణరాజు ఏపీలో ఓట్లు-సీట్లపై హాట్ కామెంట్లు చేశారు. ఏపీలో వైసీపీ సర్కారుపై మైనారిటీ ముస్లింలు విశ్వాసం కోల్పోయారని.. దీంతో వీరి ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో వైఎస్‌ను చూసి మైనారిటీలు వైసీపీవైపు మొగ్గు చూపారని చెప్పారు. కానీ, ఇప్పుడు జగన్ చేజేతులా వారిని దూరం చేసుకున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి వైసీపీ కష్టాలు తప్పేలా లేవు. లోక్ సభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో 22 చోట్ల గెలిచాం. కానీ, ఇప్పుడు 4, 5 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదు. 2009లో కాంగ్రెస్ విజయం సాధించింది. తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్తా వైఎస్సార్సీపీగా మారింపోయింది. గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు వైసీపీకి వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు
అని వివరించారు.
6 శాతం కట్!
రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఎంతో ఓటు బ్యాంకు వచ్చిందని చెప్పుకొన్న వైసీపీనాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కోత పెట్టనున్నారని ఎంపీ రఘురామ అన్నారు. ఇప్పుడు 6 శాతం మేర ఓట్లు వైసీపీకి పడే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. ముస్లిం, మైనార్టీ ఓట్లు గతంలో వైఎస్‌ను చూసి వేశారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలు వైసీపీ వైపు లేరని వ్యాఖ్యానించారు. ఆ ఓట్లన్నీ తిరిగి కాంగ్రెస్‌కు పడినా ఆశ్చర్యం లేదని అన్నారు. అయితే.. అంత మాత్రాన కాంగ్రెస్ గెలుస్తుందని కాదన్నారు.
కడప, రాజంపేట పోతాయి!
మిశ్రమ ఫలితాలకు కేంద్రంగా ఉన్న రాజంపేట, కడప పార్లమెంటు సీట్లపైనా రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కడప, రాజంపేట వైసీపీకి దక్కే అవకాశం లేదని.. తన మిత్రులు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీలలో కొంత శాతం మార్పు కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీ 40 సీట్లు, పార్లమెంటులో 4 నుంచి 6 సీట్లు మాత్రమే దక్కుతాయని ఆయన జోస్యం చెప్పారు. అందుకే కీలక నేతలు మౌనంగా ఉన్నారని చెప్పుకొచ్చారు..