ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ నాయకులకు ఐప్యాక్ ఫీవర్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన సీమ జిల్లాల్లో (ఇక్కడ టీడీపీ మూడు సీట్లు మాత్రమే గెలిచింది) వైసీపీ పరిస్థితిపై ఐప్యాక్ చాలా లోతుగానే పరిశీలన చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరి నాయకుల జాతకాలు అంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. దీంతో పలువురు నాయకులకు ఐప్యాక్ ఫీవర్ పట్టుకుందనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.
ముఖ్యంగా..గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను సమస్యలపై స్థానికులు నిలదీస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా వైసీపీ సర్వే సంస్థ ఐప్యాక్ బృందం సర్వే నిర్వహించింది. జనంలో అసంతృప్తి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. వైసీపీ నేతల అంచనా ప్రకారం.. చిత్తూరు, పలమనేరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, వెంకటేశ్ గౌడలపై సర్వేలో యాంటీ రిజల్ట్ వచ్చినట్టు సమాచారం.
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై భూ ఆక్రమణల ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొన్ని ఆక్రమణల్లో ఆయన పేరు బయట పడితే, మరికొన్నిచోట ఆయన అనుచరులు.. వైసీపీ రెండో స్థాయి నాయకుల పేర్లు ఉంటున్నాయి. గడప గడప కార్యక్రమంలోనూ ఆయనకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఉన్నట్లు చెబుతారు. దీనికి తోడు ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి నగదును విరివిగా ఖర్చు పెడుతున్నారు.
ఈ సారి చిత్తూరు టికెట్టు ఆయనకేనంటూ అతని అనుచరులు విస్తృతంగా చెబుతున్నారు. దీంతో ఆరణి విషయంపై సర్వే కూడా ఇలా తేలడంతో ఆయనకు కంటిపై కునుకు లేకుండా పోయిందని తెలుస్తోంది.
ఇక పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వెంకటేశ్ గౌడకు బలమైన వ్యతిరేక వర్గాలున్నాయని తేలిందట. ప్రారంభంలో పలమనేరు సమీపంలోని ఓ క్వారీని ఈయన స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోవాల్సిందేనన్న విమర్శలున్నాయి. జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేకి మధ్య నిత్యం ప్రొటోకాల్ రగడ నడుస్తూనే ఉంది. మొత్తానికి ఈ విషయాలనే ఐప్యాక్ తన సర్వేలో స్పష్టం చేయడంతో వారికి టికెట్‌పై బెంగ పట్టుకుందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates