తరచుగా ఈ దేశంలో వినిపించే మాట.. జమిలి ఎన్నికలు! కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. అదిగో జమిలి ఎన్నికలు.. ఇదిగో జమిలి ఎన్నికలు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తుంటాయి. ఇక, రాజకీయ పార్టీలు కూడా దీనిపై కామెంట్లు చేయడం.. పరిపాటిగా మారింది. అయితే.. తాజాగా ఈ విషయంలో ఉన్న అన్ని శంకలకు.. కేంద్రంలోని మోడీ సర్కారు చెక్ పెట్టింది. జమిలి అంత ఈజీకాదు! అని ఒక్క మాటతో తేల్చేసింది.
అంతేకాదు.. జమిలి ఎన్నికల విషయంలో ఉన్న అనేక అవరోధాలు.. ఇబ్బందులు.. వ్యయంవంటివాటిని స్పష్టంగా పూసగుచ్చినట్టు చెప్పేసింది. ఈ విషయంపై రాజ్యసభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరాలు వెల్లడించారు.
జమిలిపై ఇదీ క్లారిటీ!
- ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అంత ఈజీ కాదు.
- దీని వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ అందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయి.
- కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు అవసరం. దీనికి అన్ని పక్షాలు ఒప్పుకొనే పరిస్థితి లేదు.
- అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయం సాధించాలి. ఇది కూడా సాధ్యం కాదు
- పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్స్ మిషన్స్ అవసరం. అందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి.
- ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పనిచేయవు.
- ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్దఎత్తున డబ్చు ఖర్చు చేయాలి. ఇది కూడా భారం
- ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం.
- ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన చేసింది.
- కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపింది.
- జమిలిపై నిర్ణయం తీసుకునేందుకు మరికొన్నేళ్లు పడుతుంది. ఇది ఇప్పట్లో సాధ్యం కాదు.