తెలంగాణలో సీనియర్ నాయకురాలు విజయశాంతి… బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా? ఆ పార్టీపై అసంతృప్తిని పరోక్షంగా బయటపెడుతున్నారా? మరో దారి చూసుకోబోతున్నారా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా మణిపూర్ ఘటనపై విజయశాంతి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఇది బీజేపీ తెలంగాణ శాఖకు మింగుడుపడడం లేదని తెలిసింది.
బీజేపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించిన ఈ రాములమ్మ.. సొంత పార్టీ తల్లి తెలంగాణను ఇప్పటి బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌లో చేరారు. చివరకు మళ్లీ బీజేపీతోనే జత కట్టారు. బీజేపీలోకి వచ్చే సమయంలో ఆమె కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. కానీ బీజేపీలోకి వచ్చాక మాత్రం ఆమె స్థానం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆమెకు పార్టీలో విలువ లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో చాలా మందికి పదవులు వస్తున్నా.. విజయ శాంతికి మాత్రం నిరాశ తప్పడం లేదు. జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా మాత్రమే ఉన్న ఆమె పార్టీ కార్యక్రమాల్లో, సమావేశాల్లోనూ అంతంతమాత్రంగానే కనిపిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆమెకు బీజేపీ నుంచి టికెట్ ఇచ్చేదానిపైనా స్పష్టత లేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె.. తన అసహనాన్ని ఇటీవల బయటపెడుతున్నారు. ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి విజయ శాంతి వెళ్లారు. కానీ తెలంగాణను వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ ఉండడంతో మధ్యలోనే వచ్చేశానని చెప్పారు. ఇక ఇప్పుడేమో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మణిపూర్ దారుణకాండపై విజయశాంతి స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరకాటంలో పెట్టేలా.. ఈ ఘటనలతో సభ్య సమాజం తలదించుకుంటోందని, నిందితులను వెంటనే ఉరి తీయాలని ఆమె ట్వీట్ చేశారు. మరి ఆమె అసంతృప్తిని గుర్తించి బీజేపీ ఏమైనా ఊరట కలిగించే చర్యలు తీసుకుంటుందా? చూడాలి. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఆమె బీజేపీని వీడడం మాత్రం ఖాయమనేనని విశ్లేషకులు అంటున్నారు.