గరం గరంగా గన్నవరం వైసీపీ

ఏపీ రాజకీయాలలో గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో వైసీపీపై ఒంటికాలి మీద లేచిన వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి…ఆ తర్వాత వైసీపీకి మద్దతిచ్చారు. అయితే, 2019లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావు…వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. వంశీ వైసీపీకి మద్దతిచ్చేనాటికి గన్నవరంలో వైసీపీ కీలకనేతగా ఆయన కొనసాగుతున్నారు. అయితే, వంశీ రాకతో గన్నవరం వైసీపీలో రాజకీయాలు గరంగరంగా మారాయి. ఆల్రెడీ వైరి వర్గాలుగా ఉన్న వంశీ, వెంకట్రావులు రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదంటే తనదని స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు.

అయితే, జగన్ మాత్రం వల్లభనేని వంశీకే గన్నవరం టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారని టాక్ వచ్చింది. దీంతో, వెంకట్రావు కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియా ప్రతినిధులతో వెంకట్రావు చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానంటూ వెంకట్రావు ప్రకటించారు. గన్నవరం రాజకీయాల్లోనే కొనసాగుతానని క్లారిటీనిచ్చారు. తాను అమెరికా వెళ్తున్నానని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రారావుతో భేటీ అయిన వెంకట్రావు ఆ తర్వాత ఈ కామెంట్లు చేశారు.

తాను అజ్ఞాతవాసంలో ఉన్నానని, రెండేళ్లుగా కొన్ని రాజకీయ ఇబ్బందుల వల్ల కార్యకర్తలకు ఏం చేయలేకపోయానని వెంకట్రావు వాపోయారు. అయితే, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేస్తారు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. ఈ నేపథ్యంలోనే వెంకట్రావు పార్టీ వీడబోతున్నారని, టీడీపీ లేదా జనసేన తరఫున బరిలోకి దిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే, వంశీపై టీడీపీ నేత పట్టాభిని బరిలోకి దించేందుకు రంగం సిద్ధమవుతోందని కూడా పుకార్లు వస్తున్నాయి.