జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఏపీపైనే దృష్టి పెట్టారు. మంచిదే. ఇక్కడ అధికారంలోకి రావాలని, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును కూడా చీలనివ్వబోనని ఆయన చెబుతున్నారు. సరే.. ఒక రాజకీయ పార్టీగా ఆయనకు ఉన్న స్వేచ్ఛను ఎవరూ కాదనరు. అయితే.. ఇదేసమయంలో గతంలో ఆయన తెలంగాణపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో తన పార్టీ కూడా పోటీ చేస్తుందని చెప్పారు.
మరో నాలుగు మాసాల్లో ఇక్కడ ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రధాన పక్షాలు ఎన్నికల గోదాలోకి దిగిపోయి.. ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి రాజకీయ వ్యూహాల వరకు కూడా.. అధికార బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగా ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చకు వస్తోంది. మీరు కోరుకుంటే.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీ చేస్తానని.. 7 పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ ఉంటుందని పవన్ నాలుగు మాసాల కిందట చెప్పారు.
వారాహి వాహానికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించినప్పుడు.. అక్కడే ఆ ఆలయానికి పక్కనే నిర్వహించిన వారాహి యాత్ర సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇది నిజమేనని అనుకున్న పలువురు నేతలు కూడా.. జనసేన దూకుడు పెరిగితే చేరేందుకు రెడీ అంటూ.. అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇప్పటి వరకు కూడా.. పవన్ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.
అంతేకాదు.. అసలు ఏపీ కన్నాముందు జరిగే తెలంగాణ ఎన్నికలపై ఆయన ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. పైగా పూర్తి సమయం ఏపీపైనే ఆయన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణను పవన్ వదిలేసుకున్నారా? ఇక, ఇక్కడ పోటీకి ఆయన దూరంగా ఉంటారా? అనే చర్చ సాగుతోంది. ఇదే జరిగితే.. ఆయన తెలంగాణలో ఇక పార్టీని మూసేసుకున్నట్టే అవుతుందని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates