ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం. అందరూ భారతీయత గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. భారతీయులైనందుకు గర్విస్తూ ఉంటారు. ఎక్కడలేని దేశభక్తి నింపుకొని ఉప్పొంగిపోతుంటారు. ఇలాంటి సమయంలో భారతీయులందరినీ ఉతికారేస్తూ మరో భారతీయుడు పెట్టిన ఆడియో సందేశం గురించి తెలుసుకోవాల్సిందే. ఆ భారతీయుడు మరెవరో కాదు.. మన తెలుగు అగ్ర దర్శకుల్లో ఒకడైన పూరి జగన్నాథ్.
కొన్ని రోజులుగా పాడ్ కాస్ట్‌లో ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి వివిధ అంశాలపై ఆసక్తికర ఆడియో సందేశాలు పెడుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజు కూడా పూరి తనదైన శైలిలో సూటిగా సుత్తి లేకుండా.. నేరుగా హృదయానికి తాకేలా ఒక సందేశం ఇచ్చాడు. ఇంతకీ పూరి ఏమన్నాడో తెలుసుకుందాం పదండి.
‘‘ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా మన గురించి మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. మనది కర్మ భూమి. కానీ కామన్ సెన్స్ ఉండదు. మనది వేద భూమి.. కానీ ఆ వేదాలెక్కడా నేర్పించరు. మనది పుణ్యభూమి.. మనం చెయ్యని పాపం లేదు. మన తల్లి భరతమాత.. కానీ గంటకో రేప్ జరుగుతుంది. మనది సువిశాల భారత ఖండం. కానీ విపరీతంగా జనాభాను పెంచేసి కొట్టుకు చస్తుంటాం.
మన దగ్గర గంగ, యమున, గోదావరి లాంటి నదులున్నాయి. కానీ ఆ నీళ్ల కోసమే కొట్టుకు చస్తుంటాం. మన దగ్గర ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. కానీ ఆ ఆలయాల ముందే చెప్పులు దొంగలిస్తుంటాం. మన దగ్గర ఎందరో మహాకవులున్నారు. కానీ ఇప్పటికీ 65 శాతం నిరక్ష్యరాస్యతతో ఉన్నాం. మనది ఆర్య సంస్కృతి. కానీ పెట్రోల్లో కిరోసిన్ కలిపేస్తాం. పాలల్లో నీళ్లు కలిపేస్తాం. మున్సిపాలిటీ వాటర్ లాగేస్తాం. రేషన్ బయట అమ్మేస్తాం. ఓట్లు అమ్ముకుంటాం.
దొంగ బిల్స్ పెడతాం. బిల్స్ ఎగ్గొడతాం. దొంగ సర్టిఫికెట్లు పెడతాం. దొంగనోట్లు గుద్దేస్తాం. టికెట్ లేకుండా రైలెక్కేస్తాం. డ్రైనేజీ మూతలు కూడా అమ్మేస్తాం. మనకున్న స్వాతంత్ర్యం వల్ల మూడు పనులు చేస్తాం. పెంట తీసి నెత్తికి రాసుకోవడం, కోడి గుడ్డు మీద ఈకలు పీకడం, పుల్లలు పెట్టి పక్కోడిని కెలకడం. పైన చెప్పినవన్నీ మనందరం చేస్తాం.
కాబట్టి ఈ సందర్భంగా మనం ఏమేం చెత్త పనులు చేస్తామో.. ఒక చోట రాసుకుందాం. ఇది ఎవరికీ చూపించొద్దు. మనకోసం మనం చేసే పని ఇది. ఇలాంటి వెధవ పనులు మళ్లీ చేయకుండా ఉండటానికే ఇది. 200 ఏళ్లు యుద్ధం చేసి మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. కానీ ఏం ప్రయోజనం. మనం మారకపోతే ఏ నాయకుడూ మనల్ని మార్చలేడు. మనం ఇలా ఉంటే మనతో పాటు మన పిల్లలూ ఇలాగే తయారవుతారు. మొన్న గాల్వాన్ లోయలో మన సైనికులు చైనా వాళ్లతో యుద్ధం చేశారు. రాళ్లతో కొట్టుకున్నారు. ప్రాణం పోయేంత వరకు వాళ్లు పోరాటం కొనసాగించారు. అదంతా దేశం కోసమే. చనిపోయిన సైనికులకు తల్లిదండ్రులు, భార్యా పిల్లలు గుర్తు రాలేదు. దేశం దేశం దేశం అని.. గర్వంగా ప్రాణాలు వదిలారు. వాళ్ల కోసమైనా మనం చీప్ పనులు మానేద్దాం. దేశం కోసం చనిపోవాల్సిన పని లేదు. గోడ మీద ఉచ్చ పోయకపోతే చాలు అది కూడా దేశభక్తే. మేరా భారత్ మహాన్. జనగణమన’’ అంటూ ముగించాడు పూరి.
ఈ మాటలన్నీ చూస్తే పూరి కలల ప్రాజెక్టు ‘జనగణమన’లోని మాటలేమో అనిపిస్తున్నాయి జనాలకు.