ఏపీలో వాలంటీర్ల పై, వాలంటీర్ల వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రజల సున్నితమైన డేటాను వాలంటీర్లు సేకరించి ప్రైవేటు వ్యక్తులకు చేరవేస్తున్నారని, ఏపీలో వాలంటీర్లు సేకరించిన డేటా హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో ఉందని పవన్ ఆరోపించడం కలకలం రేపింది. ఆ డేటానుపయోగించి హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా ప్రతి విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లను అవమానిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పరువుకు పవన్ వ్యాఖ్యలు భంగం కలిగించేలా ఉన్నాయని వాలంటీర్లు భావిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, వాలంటీర్లపై పవన్ దురుద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశారరని, వాలంటీర్లలో మహిళలను కించపరిచేలా పవన్ మాట్లాడారని ఆరోపిస్తోంది.
మరోవైపు, వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరుకాని వాలంటీర్లపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తనతోపాటు, పార్టీ శ్రేణులు, అధికారులు హాజరైనపుడు వాలంటీర్లు రాకపోవడం ఏంటని ధర్మాన మండిపడ్డారు. పని చేయడం ఇష్టం లేని, ఆసక్తి లేని వాలంటీర్లు తమకు వద్దని, వారు స్వచ్ఛందంగా తొలగిపోవచ్చని చెప్పారు. సమావేశానికి గైర్హాజరైన వాలంటీర్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.