అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని చెప్పిన జగన్…సీఎం అయిన తర్వాత మాట మార్చారు. ప్రతి తల్లికి అమ్మఒడి కాస్తా..ప్రతి పిల్లవాడికి అమ్మఒడి అంటూ జగన్ మాట తప్పి మడమ తిప్పారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇక, ఆ పథకం నిధులైనా సరిగ్గా ఇస్తున్నారా అంటే ..అదీ లేదు. అమ్మఒడి పథకం నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతున్నాయని చెబుతున్న జగన్…మీట నొక్కి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.
కానీ, ఆ నిధులు లబ్ధిదారుల ఖాతాలలో జమ అయ్యేందుకు మాత్రం చాలా రోజులు పడుతోంది. దీంతో, బ్యాంకులకు వెళ్లిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌పై చెక్‌బౌన్స్ కేసు పెడతామని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సగం మంది లబ్ధిదారుల ఖాతాల్లో అమ్మఒడి డబ్బులు పడలేదని రవి ఆరోపించారు. పంట ఇన్సూరెన్స్ డబ్బులు కూడా చాలా మంది రైతులకు జమ కాలేదని, నిధులు విడుదల చేశామని సీఎం చెప్పినా డబ్బులు ఎందుకు పడలేదని ప్రశ్నించారు. జగన్ బటన్ నొక్కి చాలా రోజులయ్యాయని దుయ్యబట్టారు.
పంటలకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చినట్టుగా జగన్ చెబుతున్నారని, కానీ, చాలామందికి ఆ డబ్బులు పడలేదని విమర్శించారు. మనం సాధారణంగా ఎవరి నుంచైనా అప్పు చెక్ రూపంలో తీసుకుంటే దానిని బ్యాంకులో వేసి క్యాష్ చేసుకుంటామని, చెక్ బౌన్స్ అయితే చెక్ బౌన్స్ కేసు పెడతామని చెప్పారు. అదే తరహాలో జగన్ అమ్మ ఒడి పథకం విషయంలో డబ్బులు పడనివారి తరఫున జగన్ పై పోలీసు స్టేషన్‌లో చెక్ బౌన్స్ కేసు పెట్టబోతున్నామని హెచ్చరించారు.