అమరావతికి వ్యతిరేకుల మద్దతు వెనుక కారణమిదే!!

2014లో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ప్రకటించిన తర్వాత కొందరు వ్యతిరేకించారు. 33 వేల ఎకరాల భూమి అవసరం లేదని, పచ్చని పొలాలు బీడు భూములుగా మారతాయని వామపక్షాలతో పాటు మరి కొందరు వ్యతిరేకత చూపారు. జస్టిస్ గోపాల గౌడ, మేధా పట్కర్ లాంటి మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, అన్నా హజారే పంపిన బృందాలు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఐఏఎస్ లు, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ నక్సలైట్లు, పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నేతలు, దళిత సంఘాల నేతలు ఇలా చాలామంది అమరావతి ప్రతిపాదనను వ్యతిరేకించన వారే.

వారిలో చాలామంది ఆయా గ్రామాల్లో సదస్సులు, సభలు నిర్వహించారు. రైతుల తరపున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తలుపూ తట్టారు. అమరావతి వద్దంటూ పుస్తకాలు రాసినవారూ ఉన్నారు. సీన్ కట్ చేస్తే..నేడు అమరావతిని కేవలం శాసనరాజధానిగా ఉంచుతూ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అనూహ్యంగా నాడు అమరావతిని వ్యతిరేకించిన వారే నేడు అమరావతి కావాలంటూ కొత్త పాట అందుకున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలింపునకు వ్యతిరేక ఉద్యమానికి వీరంతా మద్దతిస్తున్నారు.

అయితే, ఆనాడు అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు…ఈనాడు అమరవాతి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకించడం వెనుక వారి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఆనాటి భూసేకరణ విధానం, రైతులకు జరుగుతున్న అన్యాయానికి ఆనాడు వ్యతిరేకంగా చాలా మంది పోరాడారు. అయితే, ఎలాగోలా భూసేకరణ అయిపోయింది. కాబట్టి ఇపుడు చేయగలిగిందేమీ లేదు. అయితే, ఇపుడు అమరవాతి నుంచి విశాఖకు రాజధాని తరలిపోవడం వల్ల సమయం, ప్రజా ధనం వృథా అవుతుందన్న భావన వారిలో ఉంది. ఇలా మళ్లీ మళ్లీ రాజధాని ప్రాంతంలో అనిశ్చితి వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.

అందుకే, ఆనాడు వ్యతిరేకించినా… ఆనాటి ఎంపిక విధానానికి వ్యతిరేకమే అయినా…తాజాగా అమరావతిపై వారంతా యూ టర్న్ తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా వామపక్ష నేతలు ఈ విధమైన వాదనను తెరపైకి తెస్తున్నారు. రేపు 2024లో అధికారం వేరొక పార్టీ చేతికి వెళితే…ఆ ప్రభుత్వం రాజధాని మరో చోట అంటే…రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నది వామపక్ష నేతలు, మిగతా నేతల వాదన. అందుకే, నాటి అమరావతి వ్యతిరేకులంతా నేటి మద్దతుదారులుగా మారుతున్నారన్నది వారి అభిప్రాయం.