సన్నాఫ్ సైఫ్…దెబ్బ కొట్టింది గురూ

మన దగ్గర స్టార్ వారసులను పరిచయం చేసే విషయంలో తండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అభిమానుల అంచనాలు ఆశలు, మార్కెట్ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారు. మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎవరిని తీసుకున్నా ఈ విషయం తేటతెల్లమవుతుంది. కానీ బాలీవుడ్ లో ఇంత శ్రద్ధ కనిపించదు. జనాలను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా చూస్తారో లేక ఏముందిలే డబ్బొస్తే చాలానే నిర్లక్ష్యం వహిస్తారో చెప్పలేం కానీ మరీ తీసికట్టు డెబ్యూలు వస్తున్నాయి. తాజాగా దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తెరంగేట్రం నాదానియాన్ తో జరిగింది.

నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ లవ్ ఎంటర్ టైనర్ కు విమర్శలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. శ్రీదేవి చిన్న కూతురు అలియాస్ జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ హీరోయిన్ గా నటించిన నాదానియాన్ ఎవరిని మెప్పించలేకపోతోంది. ధనవంతురాలైన ఓ అమ్మాయి పాతిక వేల అద్దెకు బాయ్ ఫ్రెండ్ ని తెచ్చుకుంటుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే అసలు కథ. తల్లితండ్రుల విభేదాలు, మధ్య తరగతి ఎమోషన్లు, హైఫై జెనరేషన్ ఆలోచనా విధానం, లవ్ పట్ల కొత్త తరం దృక్పథం ఇలా అన్ని అంశాలను మిక్సీలో వేసిన తిప్పిన దర్శకుడు షానా గౌతమ్ దేన్నీ సరైన పాళ్ళలో బ్యాలన్స్ చేయలేక అత్తెసరు కంటెంట్ చేతిలో పెట్టాడు.

లుక్స్ పరంగా ఇబ్రహీం పర్వాలేదనిపించినా యాక్టింగ్ పరంగా నాన్నకు ఆమడ దూరంలో ఉన్నాడు. సానబడితే ఫ్యూచర్ ఉంది. ఇక ఖుషి కపూర్ గురించి తక్కువ మాట్లాడుకోవడం బెటర్. స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ మెరుగుపరుచుకోకపోతే అక్క సంపాదించుకున్న మార్కెట్ లో పావు వంతు కూడా దక్కదు. సునీల్ శెట్టి, మహిమా చౌదరి, దియా మిర్జా లాంటి సీనియర్లు అంతోఇంతో తమ అనుభవంతో నెట్టుకొచ్చారు కానీ కథా కథనాలు విపరీతంగా విసిగించేలా ఉండటంతో నాదానియాన్ నిరాశపరుస్తుంది. ఓటిటిలో సినిమాలు, సిరీస్ లన్నీ చూశాం ఇంకే ఆప్షన్ లేదంటే తప్ప ఇబ్రహీం జంటని రికమండ్ చేసే ఛాన్సే లేదు.