టీడీపీ త్యాగం!.. కూటమి మరింత ధృడం!

టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఏపీలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఏ మేరకు ఉందన్న విషయాన్ని టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పదే పదే చెప్పారు. చంద్రబాబు మాటను నమ్మిన ఏపీ ఓటర్లు కూటమికి రికార్డు మెజారిటీతో విజయం కట్టబెట్టారు. కూటమిపై ప్రజలు నమ్మకం ఉంటారు కదా…మరి వారి నమ్మకాన్ని వమ్ము చేయని రీతిలో పాలన ఉండాలి కదా. ఏడాది తిరక్కుండానే గతి తప్పిన ఏపీ పాలనను చక్కదిద్దిన చంద్రబాబు.. తాజాగా జనం విశ్వాసం చూరగొన్న కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా నిదానంగానే అయినా కీలక అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ త్యాగాలు చేయాల్సిందేనని కూడా చంద్రబాబు చెబుతూ…ఆ మంత్రమే కూటమిని మరింత ధృడం చేస్తుందని నిరూపిస్తున్నారు.

ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు, వైసీపీకి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తిలు ఈ నెలాఖరుతో శాసన మండలి నుంచి రిటైర్ అవుతున్నారు. అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యా బలం ఆధారంగా అన్ని సీట్లు కూడా టీడీపీకే దక్కనున్నాయి. అయితే మిత్ర ధర్మాన్ని పాటిస్తూ చంద్రబాబు… ఓ సీటును జనసేనకు ఇచ్చారు. మిగిలిన నాలుగు సీట్లలో టీడీపీ అభ్యర్థులే బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని పక్కనపెట్టేసిన చంద్రబాబు… కూటమి మిత్రపక్షం బీజేపీకి కూడా ఓ ఎమ్మెల్సీ సీటును కేటాయించారు. ఈ పరిణామాన్ని ఏ ఒక్కరూ ఊహించలేదనే చెప్పాలి. రెండు మిత్ర పక్షాలకు తలో సీటు ఇచ్చిన చంద్రబాబు..మిగిలిన మూడు సీట్లనే టీడీపీ నేతలకు కేటాయించారు.

ఇటీవలే ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. వారిలో బీద మస్తాన్ రావు, టీడీపీలో చేరగా… ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరారు. ఈ మూడు సీట్టలో ఓ సీటును బీజేపీకి ఇచ్చిన చంద్రబాబు.. రెండు సీట్లను మాత్రమే టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. ఈ సందర్భంగా జనసేన కూడా ఓ సీటును అడగగా….జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగేంద్రబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుందామని ప్రతిపాదించడంతో జనసేన సరేనంది. అనుకున్నట్టుగా జనసేనకు ఈ దఫా ఓ ఎమ్మెల్సీని కేటాయించారు. ఇక గతంలోనే ఓ రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చిన నేపథ్యంలో…. ఈ దఫా ఎమ్మెల్సీ సీట్లలో ఆ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. బీజేపీ నుంచి కూడా పెద్దగా ఒత్తిడేమీ కూడా రాలేదనే చెప్పాలి.

అయినా కూడా చంద్రబాబు మిత్ర ధర్మాన్ని పాటించారు. అసెంబ్లీలో టీడీపీ బలం 135. జనసేన బలం 21. బీజేపీ బలం 8 మాత్రమే. ఈ లెక్కన బీజేపీ, జనసేన అవసరం లేకుండానే టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. అయితే ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం మేరకు ఆ రెండు పార్టీలతో కలిసే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ రెండు పార్టీలకు తన కేబినెట్ లో సముచిత స్థానం కూడా కల్పించారు. పవన్ కు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. బీజేపీ నేతలకు కూడా కీలకమైన శాఖలనే కేటాయించారు. వెరసి కూటమి ఐక్యత గరించి చంద్రబాబు పట్టుదలతో ఉన్నారన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా టీడీపీని త్యాగం బాటన నడిపి…మిత్రపక్షాకు సముచిత స్థానం కల్పిస్తూ సాగారు. ఈ తరహా చంద్రబాబు వైఖరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.