శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(శ్రీశైలం కుడి కాల్వ) టన్నెల్‌లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో చిక్కుకు పోయిన.. ఆరుగురు కూలీలు, ఇద్దరు ఇంజనీర్లు లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. ఆనాడు జరిగిన ఘోర ప్రమాదంలో వారంతా లోపలే చిక్కుకుపోయారు. అయితే.. వీరిని కాపాడేందుకు జాతీయ, అంతర్జా తీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుని ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే.. ఎవరి జాడా కనిపించలేదు. తాజాగా మనిషి శరీరానికి సంబంధించిన ఆనవాళ్లు కాంక్రీట్‌లో కనిపించినట్టు అధికారులు తెలిపారు.
దీంతో ఆ ఎనిమిది మంది పరిస్తితి ఇలానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ భౌతిక దేహాలు కనిపించినా.. ప్రాణాలతో ఉండే అవకాశం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. తాజాగా టీబీఎంకు ఎడమ పక్కన ఒక చేయిని స్నిఫర్ డాగ్స్ గుర్తించాయి. దీనిని అధికారులు వెలికి తీయించారు. అయితే.. మరింతలోతుగా పనిచేస్తేనే ఇతరుల ఆనవాళ్లు లభిస్తాయని తెలిపారు. ప్రస్తుతం కనిపించిన ఆనవాళ్లు ఆధారంగా కాంక్రీట్ మిశ్రమంలో కార్మికులు కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.
దీంతో కాంక్రీట్‌ను తొలగించేందుకు, కార్మికులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి ఘటన జరిగి 16 రోజులు అయిందని చెబుతున్నారు. దీంతో ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అంటున్నారు. టన్నెల్‌లో అణువణువునూ గాలిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. సహాయక చర్యలకు.. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఊట నీరు పైకి ప్రవహిస్తుండడంతో పనులు చేపట్టడం దుశ్శాధ్యంగా మారుతోందని అంటున్నారు.
ఏదేమైనా.. 8 మంది ఆచూకీ విషయం అనుమాస్పదమేనని చెబుతున్నారు. ఇదిలావుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు.. సఫలం అయినా.. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అన్నట్టుగా పరిస్థితి మారే సరికి సర్కారు కూడా.. ఆవేదనలో మునిగిపోయింది. అయితే, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.