అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మహిళలకు మరింత భద్రత లభించింది. ఈ మేరకు ఏపీలోని కూటమి సర్కారు నేతృత్వంలోని పోలీసు శాఖ శక్తి యాప్ పేరిట ఓ సరికొత్త యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు శక్తి యాప్ ను ప్రారంభించారు.
గతంలో వైసీపీ సర్కారు దిశ యాప్ పేరిట మహిళల సేఫ్టీ కోసం ఓ యాప్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. యాప్ తో పాటు దిశ పేరిట ఓ చట్టాన్ని కూడా రూపొందించింది. అయితే ఈ చట్టానికి కేంద్రం నుంచి అనుమతి లబించకపోవడంతో దిశ చట్టం ఇప్పటిదాకా అమలులోకే రాలేదు. తాజాగా ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి సర్కారు… మహిళల భద్రత కోసం మరింత మెరుగైన సేవలతో కూడిన యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా పోలీసు శాఖలో మహిళలు, చిన్న పిల్లల భద్రత కోసం వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ పేరిట ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అదికారి నేతృత్వం వహిస్తారు.
ఇక శక్తి యాప్ విషయానికి వస్తే… ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న మహిళలు… తాము ఆపదలో ఉన్నప్పుడు.. కేవలం తమ ఫోన్లను మూడు సార్లు షేక్ చేస్తే… సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం వెళుతుంది. అక్కడి నుంచి పోలీసులు కేవలం 5 నుంచి 7 నిమిషాల్లోనే ఆపదలో ఉన్న మహిళ వద్దకు చేరుకుంటారు. వారిని ఆపద నుంచి రక్షిస్తారు. ఇక ఈ యాప్ లో ఈ తరహా భద్రతతో పాటుగా పలు కొత్త ఫీచర్లను కూడా జత చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే మహిళలు ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చిన్న పిల్లల ఆచూకీ కోసం ఫిర్యాదులు చేయవచ్చు. ఇంతటి ప్రాదాన్యం ఉన్న ఈ యాప్ ప్రారంభోత్సవానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హాజరు కాగా… రీజనేంటో తెలియదు గానీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాత్రం గైర్హజరయ్యారు.