సినీ రంగంలో ఉన్న వాళ్లు అక్కడ డబ్బులు సంపాదించి.. వేరే రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. చాలామంది రియల్ ఎస్టేట్ వైపు చూస్తే కొందరు ఫుడ్ బిజినెస్ మీద ఫోకస్ పెడతారు. టాలీవుడ్ హీరోల్లో సందీప్ కిషన్ వివాహ భోజనంపు పేరుతో రెస్టారెంట్ ఛైన్ నడుపుతున్న సంగతి తెలిసిందే. దర్శకురాలు నందిని రెడ్డితో పాటు ఇంకా కొంతమందికి రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం కూడా రాబోతున్నాడు. త్వరలోనే అబ్బవరం వారి రెస్టారెంట్ రాబోతున్నట్లు తన కొత్త చిత్రం దిల్ రుబా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కిరణ్ వెల్లడించాడు. అథెంటిక్ రాయలసీమ ఫుడ్ జనాలకు అందించాలన్నది తన ఉద్దేశమని.. అందుకోసం రెస్టారెంట్ ఛైన్ ఓపెన్ చేద్దామనుకుంటున్నానని.. అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉంటుందని కిరణ్ తెలిపాడు.
ఇక సినిమా రంగంలోకి రాకపోయి ఉంటే కచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడినని కిరణ్ తెలిపాడు. రాయలసీమ వాసిగా రాజకీయాలను చిన్నప్పటి నుంచి దగ్గరగా చూశానని.. రాజకీయాలపై ఆసక్తి, అవగాహన రెండూ ఉన్నాయని కిరణ్ తెలిపాడు. ప్రజలతో మమేకం కావడాని్ని తాను చాలా ఇష్టపడతానని అతనన్నాడు. తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకుని, సినిమాల్లోకి వచ్చినపుడు చాలా బాధ పడ్డానని, కన్నీళ్లు వచ్చాయని.. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని కిరణ్ తెలిపాడు.
రహస్య గోరక్‌తో తన వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగిపోతున్నట్లు కిరణ్ వెల్లడించాడు. రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో వెలుగులోకి వచ్చిన కిరణ్.. ఒక దశలో వరుసగా అవకాశాలు అందుకున్నాడు. కానీ వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. రూల్స్ రంజన్ తర్వాత అతను గ్యాప్ తీసుకుని గత ఏడాది క మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కిరణ్ కొత్త సినిమా దిల్ రుబా మార్చి 14న మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది.