ఏపీ అధికార పార్టీ వైసీపీకి కంచుకోటగా పేర్కొనే జిల్లా కడప. అయితే.. ఈ జిల్లాలో బలపడాలని ప్రతిపక్షం టీడీపీ ఎప్పటి నుంచో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో నాయకులను కూడా కదిలిస్తోంది. దీంతో టీడీపీని బలపరి చేందుకు కడప నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు వైసీపీలో నెలకొన్న వివాదాలు, విభేదాల కారణంగా కొందరు నాయకులు బయటకు వస్తున్నారు.ఈ పరంపరలో నిన్న మొన్నటి వరకు వైసీపీకి జైకొట్టిన ఎమ్మెల్యే సోదరుడు ఒకరు తాజాగా ఉండవల్లిలో చంద్రబాబును కలిసి.. పార్టీలో చేరేందుకు సమ్మతి వ్యక్తం చేశారు.
సదరు ఎమ్మెల్యే సోదరుడి చేరికకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. కడప జిల్లాలో కీలకమైన నియోజకవర్గం రాజంపేట. 2019లో మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ తరఫున ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఈయన 2014లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే 2019 ఎన్నికలకు ముందు మాత్రం వైసీపీలో చేరిపోయారు. ఇదిలావుంటే.. అన్నతోపాటేరాజకీయాలు చేసే ఆయన సోదరుడు.. మేడా విజయశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు అన్న ఎక్కడ ఉంటే ఆయన కూడా అక్కడే ఉన్నారు.
అయితే.. ఇటీవల కాలంలో రాజంపేట వైసీపీలో ముసలం పుట్టింది. అభివృద్ధి లేదని.. ప్రజల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిం దని ఎమ్మెల్యే మేడా చెబుతున్నారు. మరో వైపు అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రం చేయాలన్న ప్రజల సెంటిమెంటు ఇంకా చల్లారలేదు. ఇదిలావుంటే.. సొంత పార్టీ నాయకులు కూడా వైసీపీపై నమ్మకం కోల్పోతున్నారనే సంకేతాలు వస్తున్నా యి. ఎందుకంటే.. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్ తరచుగా ఇక్కడ ప్రజల నుంచి వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ వైసీపీ మరింత పలచన అవుతుందనే సంకేతాలు వస్తున్నాయి.
దీనిని గమనించిన మేడా విజయశేఖర్ రెడ్డి కొన్నాళ్లుగా టీడీపీకి టచ్‌లో ఉంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన తాజాగా ఉండవల్లికి వచ్చి.. పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు చంద్రబాబు ఆయనతో స్థానిక అంశాలపై చర్చించారు. టీడీపీ బలోపేతం అవుతోందన్న సంకేతాలను మేడా విజయశేఖర్ రెడ్డి వివరించారు. ప్రజల డిమాండ్‌ను పరిష్కరించే అవకాశం ఉంటే.. పరిశీలించాలని ఆయన కోరినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే త్వరలోనే పార్టీలో చేరేందుకు ఆయన ఉత్సాహం చూపించారు. దీనిపై త్వరలోనే చెబుతానని.. ముందు.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను ఒప్పించాలని చంద్రబాబు సూచించినట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు తెలిపాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates