ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయి. అయితే, వైసీపీ మినహా టిడిపి, బిజెపి, జనసేనలు పొత్తులపై మల్లగుల్లాలు పడుతున్నాయి. టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కొద్ది రోజుల క్రితం బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ ఈక్వేషన్ నుండి టిడిపిని వేరు చేశాయి. దీంతో, జనసేన-టీడీపీ లేదా జనసేన-బీజేపీ ల మధ్య పొత్తు ఉండే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్డీఏ మిత్ర పక్షాల భేటీకి హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశానికి గతంలో ఎన్డీఏ మిత్రపక్షమైన టిడిపికి ఆహ్వానం అందకపోగా జనసేనకు మాత్రం ఆహ్వానం అందింది. దీంతో, ఎన్డీఏలో టీడీపీకి గేట్లు మూసుకుపోయినట్లే. మొత్తం 38 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాయని, ఇది బిజెపి బల ప్రదర్శన అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చెప్పారు. దీంతో, బీజేపీ-జనసేనల మధ్య పొత్తు ఖాయమని ముమ్మరంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులపై ఢిల్లీలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎన్నికల పొత్తులపై కూడా బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవకాశం కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని పవన్ అన్నారు. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశామని, 2019లో విడివిడిగా పోటీ చేశామని పవన్ గుర్తు చేసుకున్నారు. మంగళవారం నాడు జరగబోతున్న ఎన్డీఏ మిత్ర పక్షాల భేటీ కోసం బీజేపీ సీనియర్ నాయకులు తనను ఆహ్వానించారని చెప్పారు. ఈ భేటీలో ఏపీ, తెలంగాణల అభివృద్ధి గురించి చర్చిస్తానని అన్నారు. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంపై కూడా చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఏది ఏమైనా పవన్ తాజా వ్యాఖ్యలతో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.