శ్రీకాళహస్తికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం చేరుకుంటున్నారు. రెండురోజుల క్రితం తమ పార్టీ లీడర్ ను సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకున్నారనే కారణంతో నిరసన తెలపటానికి, ఫిర్యాదు చేయటానికి పవన్ శ్రీకాళహస్తి చేరుకుంటున్నారు. ముందు తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదుచేసి తర్వాత శ్రీకాళహస్తికి వెళతారని జనసేన నేతలు చెబుతున్నారు. తమ నేతపై సీఐ చేయిచేసుకోవటాన్ని పవన్ పదేపదే వారాహియాత్రలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.
నిజానికి ఘటన చిన్నదే. అయితే పవన్ ఎందుకింత సీరియస్ గా తీసుకున్నట్లు ? హడావుడిగా తిరుపతికి వెళ్ళి ఫిర్యాదు చేయటం, తర్వాత శ్రీకాళహస్తికి ఎందుకు వెళుతున్నట్లు ? ఇక్కడే పవన్ వ్యూహం పన్నినట్లు అర్ధమవుతోది. ఎన్నికలు వస్తున్నాయి కదా ప్రతి చిన్న అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా అడ్వాంటేజ్ తీసుకోవాలనే అనుంటుంది. ఇక్కడ పవన్ కూడా అదే చేస్తున్నారు. ఒక నేతను ఏ పోలీసు అధికారి కూడా పబ్లిక్ గా చేయిచేసుకోరు. అక్కడ నేతలకు, సీఐకి మధ్య ఏదో గొడవ జరిగే ఉంటుంది.
అయితే నేతలు సీఐని ఏమన్నారన్నది రికార్డుల్లో ఎక్కడా లేదు. నేతను సీఐ చెంపదెబ్బ కొట్టడమే వీడియోలో కనబడుతోంది. దాన్ని పవన్ గట్టిగా పట్టుకోవటంతో ఇష్యు ఇంత సంచలనంగా మారింది. పవన్ అజెండా ఏమిటంటే తమ పార్టీ నేతలపై ఎవరు చేయి చేసుకున్నా పవన్ చూస్తు ఊరుకోరు అనే సంకేతాలు పార్టీలో బలంగా వెళుతుంది. దాంతో రేపు ఏ చిన్న కార్యక్రమానికి పిలుపిచ్చినా నేతలు నిర్భయంగా రోడ్లపైకి వస్తారు. అలాగే పార్టీ నేతల్లో నైతిక స్థైర్యం పెరిగిపోతుంది.
ఇప్పటివరకు జనసేనలో నేతలున్నారు అంటే ఉన్నారని చెప్పుకుంటున్నారంతే. రేపటి నుండి విషయం ఎంతచిన్నదైనా సరే రోడ్లమీదకు చేరుకుని చొక్కాలు చిరిగిపోయేట్లుగా పోరాటాలకు రెడీ అయిపోతారు. పవన్ కు కావాల్సింది సరిగ్గా ఇదే. పొత్తున్నా లేకపోయినా పార్టీకి కమిటెడ్ గా పనిచేసే నేతలు, కార్యకర్తలే పవన్ కు కావాల్సింది. ఇప్పటి వరకు ఇలాంటి నేతలు పార్టీలో పెద్దగా లేరు. ఈ ఘటనతో నేతలు పార్టీని ఓన్ చేసుకుంటారు. పవన్ కు కావాల్సింది ఇదే కాబట్టే ఇంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates