జగన్ ఓ రౌడీ పిల్లాడు:పవన్

సీఎం జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. తణుకులో మాట్లాడిన పవన్ కల్యాణ్…జగన్ పై విమర్శలు గుప్పించారు. ధైర్యంతో పోరాడితే బ్రిటిష్ వారే పారిపోయారని, జగన్ ఎంత అని ప్రశ్నించారు. జగన్ గిచ్చాడని మోదీకి ఫిర్యాదు చేస్తే బాగోదని, జగ్గూ గ్యాంగ్‌ను హ్యాండిల్ చేయడం తమకు తెలుసుని అన్నారు. తన పోరాటం జగన్ పై కాదని, ప్రజా సమస్యలపై అని చెప్పారు.

జగన్ అనేవాడు తనకు ఆనడని, జగన్ పోతే రేపు మరో జగన్ వస్తాడని, తమ పోరాటం సమస్యలపై అని చెప్పారు. జగన్ ఒక రౌడీ పిల్లాడని చురకలంటించారు. తన కుటుంబం జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని, కానీ, వాలంటీర్ వ్యవస్థలో యువతీవయుకుల సామర్థ్యాన్ని గుర్తించే ప్రయత్నం తాను చేస్తానని చెప్పారు. సమాజంపై ప్రేమతో తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చానని చెప్పారు.

వైసీపీ నేతల విమర్శలను తాను, తన కుటుంబం ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. పంచాయతీ వ్యవస్థ ఉండగా సచివాలయ వ్యవస్థ ఎందుకని నిలదీశారు. ప్రజల మాన ప్రాణాలకు భంగం కలిగిస్తే తన అభిమానినైనా శిక్షించాల్సిందేనని పవన్ అన్నారు. టీడీపీకి జనసేన బీటీమ్ అని వైసీపీ నేతలు అనడం సహజమని, జనసేన పార్టీ వాళ్లు కూడా అనడం తనకు బ్బందిగా ఉందన్నారు. అబద్ధాలు చెప్పాల్సిన పని తనకు లేదన్నారు.

శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిని సీఐ అంజూయాదవ్ చెంపదెబ్బ కొట్టడంపై పవన్ స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకుడిని చెంపదెబ్బ కొట్టడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ నేతలకు అండగా నిలిచేందుకు శ్రీకాళహస్తి వెళ్లనున్నట్లు పవన్ తెలిపారు. రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు సూచించారు.