నీతులు చెప్పటం తప్పేం కాదు. కానీ.. పాటించే వాడు చెబితే బాగుంటుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి… మందు తాగి వాగాడు అని వ్యాఖ్యానించి సారీని డిమాండ్ చేసిన వ్యక్తి కాసేపటికి రోడ్డు పక్కన కూర్చుని బహిరంగ మద్య పానం చేసిన సంఘటన వైరల్ అయ్యింది.
కొందరు వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు.. ఆందోళనలు చేపట్టటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం బస్టాండ్ కూడలిలోనూ నిరసన చేశారు. దిష్టి బొమ్మ తగలబెట్టారు. నినాదాలు చేస్తూ.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ఇంతవరకు బాగున్న సీన్.. ఆ తర్వాతే తేడా కొట్టేసింది. పవన్ మాటల్ని తప్పు పడుతూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వాలంటీర్లలో కొందరు.. తమ నిరసన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత దేవరపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న మద్యం దుకాణంలో ఎనిమిది మంది వాలంటీర్లు రెండు ఫుల్ బాటిల్స్ తీసుకొని మద్యం సేవించారు. పవన్ కల్యాణ్ మద్యం తాగి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడిన వారిలో కొందరు.. తమ నిరసన కార్యక్రమాన్ని పూర్తి చేసిన వెంటనే చేసిన పని చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకొని తాగాలని విమర్శించిన వాలంటీర్ ఒకరు.. మందు బాటిల్ లోని మందును కూల్ డ్రింక్ బాటిల్ లో పోసుకుంటూ కెమేరాకు దొరికిపోయిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీతులు చెప్పి నిమిషాలు గడవక ముందే.. ఇలా చేయటమా? అన్నదిప్పుడు ప్రశ్న. నిలదీయటం తప్పు కాదు. కానీ.. ఇలా దొరికిపోవటమే అసలు ఇబ్బందన్న మాట వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates