నీ వల్ల అందరూ ఆమెను అనే పరిస్థితి వచ్చింది:రోజా

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదని రోజా మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామని పవన్, చంద్రబాబులకు అర్థమైందని, వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావడం జీర్ణించుకోలేకే పవన్ అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

మహిళలన్నా, వాలంటీర్లన్నా పవన్ కు గౌరవం లేదని, సీఎం జగన్ ను కూడా చులకన చేసి మాట్లాడుతున్నారన్నారని విమర్శలు గుప్పించారు. జగన్ ను చూసి వణుకుతున్న పవన్, చంద్రబాబులు..తాజాగా వాలంటీర్లను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ విషం చిమ్ముతున్నారని, ఆ వ్యాఖ్యలకు గాను వాలంటీర్ల కాళ్లు పట్టుకొని పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే వాలంటీర్లే నీ సంగతి తేలుస్తారని పవన్ కు వార్నింగ్ ఇచ్చారు.

ఆడవాళ్ల అక్రమ రవాణా కోసం వాలంటీర్లు ఉద్యోగం చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ మాటలు సిగ్గుచేటని, పవన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఉమెన్ ట్రాఫికింగ్ టాప్ 10లో ఏపీ లేదని, తెలంగాణ ఆరో స్థానంలో ఉందని, అక్కడకు వెళ్లి కేసీఆర్ ను ప్రశ్నించగలవా? పవన్ అని ప్రశ్నించారు. కేసీఆర్ గురించి మాట్లాడితే మక్కెలిరగ్గొడతారని, హైదరాబాద్ లో బతకలేరు కాబట్టే అక్కడ మాట్లాడవని మండిపడ్డారు. వాలంటీర్లపై ఆ వ్యాఖ్యలు చేశావని, నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా? అని ప్రశ్నించారు.

‘నీ తల్లి చాలా గొప్పది.. అలా అనకూడదు… కానీ, నీ వల్ల అందరూ ఆమెను అనే పరిస్థితి వచ్చింది’ అని పవన్ ను ఉద్దేశించి మండిపడ్డారు. నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా అని వ్యాఖ్యానించినందుకు ‘అమ్మా.. నన్ను క్షమించమ్మా’ అని పవన్ మాతృమూర్తిని రోజా క్షమాపణ కోరారు.