జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రెండో దశ యాత్రను ప్రారంభించారు. తొలిరోజు ఆదివారం ఏలూరులో యాత్ర నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి సీటుకు విలువ ఇస్తున్నానని, జగన్‌కు మాత్రం కాదని వ్యాఖ్యానించారు.
“సీఎం పీఠానికి విలువ ఇస్తాను.. జగన్‌కు కాదు. వైసీపీ నేతల రాజకీయ విలువలు మాట్లాడుతున్నాను. నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. ఎంత దిగజారుడుతనంతో మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారు. వింటున్నారు. సీఎంను ఇక నుంచి ఏకవచనంతోనే పిలుస్తాను. వైసీపీ నాయకులను నువ్వు అని ఏకవచనంతో మాట్లాడతాను. సీఎం పదవికి జగన్ అనర్హుడు. వైసీపీ ఈ రాష్ట్రానికి సరైనది కాదు” అని నిప్పులు చెరిగారు.
ఏలూరులో వరదల వస్తే ఎందుకు మునిగిపోతుంది.. రక్షణ గోడలు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. జగన్‌కు జనసేన నేతలు, కార్యకర్తలు బానిసలు కారన్నారు. సీఎం పదవికి బానిసలం కాదన్నారు. సీఎం కూడా మనలో ఒకడు అంతే అని పవన్ వ్యాఖ్యానించారు. “మన శ్రమశక్తితో కట్టే పన్నులకు, ఖజానాకు సీఎం జవాబుదారీ. మన రాష్ట్ర ఖజానా రూ. 10 లక్షల కోట్లు. వాటిని ఎలా ఖర్చుపెట్టారో మనకు చెప్పాలి” అని పవన్ నిలదీశారు.
జగన్ రూ. లక్షా 18 వేల కోట్లు అప్పు తీసుకుని ఎందుకు ప్రజలకు లెక్క చెప్పలేదని పవన్ ప్రశ్నించారు. “కాగ్ నిన్ను ఎందుకు ప్రశ్నించింది. దానికి నువ్వు, నీ మంత్రులు సమాధానం చెప్పాలి. రూ.22 వేల కోట్లు లిక్కర్ బాండ్లపై అప్పు తీసుకుని, ఆ డబ్బు ఏం చేశారు. రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డబ్బు ఏం చేశావో నువ్వు, నీ మంత్రివర్గం రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు” అని పవన్ డిమాండ్ చేశారు. పోరాటం చేస్తే విజయం వస్తుందో లేదో తెలీదని, అయినా పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు.