ఈ ముగ్గురు నేతలు మాయమైపోయారా ?

ముఖ్యమంత్రి తమ జిల్లాకు వస్తున్నారంటే నేతలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోటీలు పడతారు. ప్రధానమంత్రి తమ రాష్ట్రానికి వస్తున్నారంటే ఆ పార్టీ నేతలంతా తప్పకుండా హాజరవుతారు. ప్రధానమంత్రి దృష్టిలో పడితే చాలని ఎగబడతారు. అలాంటిది వరంగల్ జిల్లాకు నరేంద్రమోడి వచ్చినా ముగ్గురు నేతలు గైర్హాజరయ్యారంటే ఏమిటర్ధం ? చాలామంది సీనియర్లు పాల్గొన్న కార్యక్రమంలో ఈ ముగ్గురునేతలు మాత్రం ఎక్కడా కనబడలేదు. ఇపుడీ విషయమే పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది.

అసలు విషయం ఏమిటంటే వరంగల్ జిల్లాలో మోడీ పర్యటించారు. రైల్వే వ్యాగన్ సెంటర్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. అలాగే ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారంచుట్టారు. మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలంతా పోటీలుపడ్డారు. ఎన్నికలు దగ్గరకువచ్చేస్తున్నాయి కదా మోడీ కంట్లో పడి ఒక నమస్కారం పెట్టుకుంటే టికెట్ గ్యారెంటీ అని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఇంతమంది పాల్గొన్న కార్యక్రమంలో విజయశాంతి, వివేక్, చంద్రశేఖర్ మాత్రం ఎక్కడా కనబడలేదు.

వీళ్ళముగ్గురు పార్టీ నాయకత్వంపైన చాలా అసంతృప్తిగా ఉన్నారని తొందరలోనే బీజేపీకి రాజీనామా చేయబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీళ్ళచూపు కాంగ్రెస్ వైపే ఉందని మరో సమాచారం. ఇప్పటికే చంద్రశేఖర్, వివేక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు మోడీ పర్యటన మరోవైపు బీజేపీకి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం మధ్యలో వీళ్ళు మాయమైపోయారు.

ఇంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కు వీళ్ళముగ్గురూ ఎందుకు దూరంగా ఉన్నారనే విషయమై ఇపుడు పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. వీళ్ళముగ్గురికీ కొత్తగా అపాయింటైన అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పెద్దగా సఖ్యత లేదు. పైగా రాబోయే ఎన్నికల్లో వీళ్ళకి టికెట్ విషయంలో కూడా సరైన హామీ దొరకలేదని సమాచారం. ఇప్పటికే తన సేవలను పార్టీ నాయకత్వం సరిగా ఉపయోగించుకోవటంలేదని విజయశాంతి బాహాటంగానే చెప్పిన విషయం తెలిసిందే. ఎందుకైనా మంచిదని వివేక్ మాత్రం బీఆర్ఎస్ నేతలతో కూడా టచ్ లో ఉన్నట్లు టాక్ వినబడుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.