గత ప్రభుత్వం ఏరి కోరి ఎంచుకుని రాజధానిని చేసిన అమరావతి విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ అంతుబట్టకుండా ఉంది. ప్రతిపక్షంలో ఉండగా.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవట్లేదని, అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రకటించిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాత్రం అమరావతి పేరెత్తితే మంటెత్తిపోయేట్లుగా వ్యవహరిస్తున్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చి.. పట్టుబట్టి దాని మీద తీర్మానం చేసి గవర్నర్‌తోనూ ఆమోద ముద్ర వేసుకున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా ఆపడం కష్టమే అన్న అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. కానీ ఎవరు అడ్డుకున్నా అడ్డుకోకపోయినా.. కోర్టు మాత్రం కచ్చితంగా ఈ నిర్ణయానికి బ్రేక్ వేస్తుందనే రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతూ వచ్చారు.
ప్రస్తుత పరిణామాలు చూస్తే అదే జరుగుతుందేమో అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ నిర్ణయంపై స్టే విధించిన హైకోర్టు.. విచారణ సందర్భంగా రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల సంగతేంటని జగన్ సర్కారును కచ్చితంగా అడుగుతుందని.. ఇక్కడ ప్రభుత్వం ఇరుకునపడుతుందని అంచనా వేస్తున్నారు.
ఐతే ఈ విషయంలో జగన్ కొంచెం ముందుగా మేల్కొని ప్లాన్-బిని అమలు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అమరావతిని మెట్రోపాలిటిన్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన జగన్.. ఈ విషయమై అధికారులతో తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు, ఇతర నిర్మాణాల్ని పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుంది, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి.. రైతుల ఫ్లాట్లను ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో అధికారులతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.
ఇలా చేయడం ద్వారా తాము రైతుల ఒప్పందాల్ని గౌరవిస్తున్నాం, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని జగన్ సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా కోర్టులో బ్రేక్ పడకుండా చూసుకోవాలని.. ఇక్కడ అడ్డంకి తొలగిపోతే అమరావతి అభివృద్ధి విషయంలో పరిస్థితుల్ని బట్టి ముందుకెళ్లవచ్చని జగన్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates