నందిగామ వైసీపీలో లెక్క‌లు మారుతున్నాయిగా..!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అసంతృప్తులు రోడ్డున ప‌డుతున్నాయి. ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావు వైఖ‌రిని నిర‌సిస్తూ.. నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క‌మైన కంచిక చ‌ర్ల మండ‌లంలో ప‌దుల సంఖ్య‌లో కీల‌క నాయ‌కులు పార్టీని వ‌దిలేశారు. వీరిలో ప‌రిటాల శివారు నెక్క‌లంపేట‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ఏంఎసీ మాజీ వైస్ చైర్మ‌న్ మాగంటి వెంక‌ట రామారావు, పీఏసీఎస్ చైర్మ‌న్ నెమ‌ల‌పురి అమ్మారావు, మాజీ చైర్మ‌న్ గుదే ప్ర‌సాద్ స‌హా ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు పార్టీకి గుడ్ చెప్పారు.

పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు తామంతా క‌ష్ట‌ప‌డ్డామ‌ని.. కానీ, నాలుగేళ్ల‌యినా.. త‌మ‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌ని వారు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో ఎమ్మెల్యే అప్పాయింట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని.. త‌మ క‌ష్టాలు చెప్పుకొనేందుకు కూడా.. ఎవ‌రూ లేకుండా పోయార‌ని వారు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వారు వైసీపీలో ఉండి ఇంక క‌ష్టాలు ప‌డ‌లేమ‌ని వాపోతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీని రాజీనామా చేశారు.

అయితే.. వారు టీడీపీలోకి చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వీరితోపాటు.. కంచిక‌చ‌ర్ల పార్టీ క‌న్వీన‌ర్ క‌ర్ల వెంక‌టేశ్వ‌ర‌రావు, కొత్త‌పేట‌కు చెందిన రైతు విభాగం నాయ‌కుడు అబ్బూరి నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు, మున్లూరుకు చెందిన సూర్య‌దేవ‌ర రాము త‌దిత‌రులు కూడా పార్టీ స‌భ్య‌త్వానికి రిజైన్ చేశారు. అయితే.. ఈ విష‌యం తెలిసిన పార్టీ అధిష్టానం వారితో చ‌ర్చ‌లు జ‌రిపింది. కానీ, వారు మాత్రం స‌సేమిరా అన్నారు. ఈ క్ర‌మంలో పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

రాజ‌కీయంగా చూస్తే.. కీల‌క‌మైన కంచిక‌చ‌ర్ల మండ‌లం ఆది నుంచి కూడా టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న ప్రాంతం. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నాయ‌కులు.. కొంత మేర‌కు చ‌క్రం తిప్పారు. దీంతో మొండితోక విజ‌యం సాధ్య‌మైంది. అయితే.. ఇప్పుడు కీల‌క నాయ‌కులే పార్టీకి గుడ్ బై చెప్ప‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గులుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి ఈ ప‌రిణామాల‌ను ఎమ్మెల్యే మేనేజ్ చేస్తారో చూడాలి.