చాప‌కింద నీరులా.. కేశినేని వ్య‌వ‌హారం..

ఎన్నిక‌ల‌కు స‌మయం చాలా ద‌గ్గ‌ర‌గా ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగితేనే 9 నెల‌లు ఉన్నాయి. కానీ, ముంద స్తు ముచ్చ‌ట‌కు ఇష్ట‌ప‌డుతున్నట్టు వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఈ స‌మ‌యం మ‌రింత త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు. త‌మ్ముళ్ల‌ను సెట్ చేస్తు న్నారు. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి ఆయ‌న‌కు కొరుకుడు ప‌డ‌డం లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు మైల‌వ‌రం, తిరువూరు, నందిగామ‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో సొంత పార్టీ ఎంపీ కేశినేని నాని అనుకూల ప్ర‌తికూల వ‌ర్గాల మ‌ధ్య పోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఈ నాలుగు నియోజ‌క వ‌ర్గా ల‌పై ఎంపీ వ్యూహ‌మే ప‌నిచేస్తోంద‌ని.. ఆయ‌న చెప్పిన‌ట్టే జ‌రుగుతోంద‌ని, పార్టీ ఏదైనా కూడా.. ఎంపీ హ‌వా ఉంద‌ని టీడీపీ అధినేత‌కు నివేదిక‌లు అందాయి. దీంతో ఇక్క‌డ స‌మీక్ష చేయాలా? వ‌ద్దా? అనేది సందే హంగా మారింది.

పై నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క విజ‌య‌వాడ తూర్పులో మాత్ర‌మే టీడీపీ అభ్య‌ర్థి గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు గెలుపు గుర్రం ఎక్కారు. మిగిలిన తిరువూరు, నందిగామ‌, మైల‌వ‌రం నియోజక‌వ‌ర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఈమూడు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా.. టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్నాయి. ఏదో గ‌త ఎన్ని క‌ల్లో జ‌గ‌న్ హవాతో ఇక్క‌డ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుందనే టాక్ వినిపించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలిచి తీరుతుంద‌ని ఇక్క‌డి నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే.. ఎంపీ కేశినేని నాని ఈ మూడు చోట్ల కూడా.. వైసీపీ ఎమ్మెల్యేల‌కు ద‌న్నుగా ఉన్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీలోనూ రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తిరువూరు మాట ఎలా ఉన్నా.. నందిగామ‌, విజ‌య‌వాడ తూర్పు, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో నాని కార‌ణంగా.. టీడీపీలో వ‌ర్గ పోరు పెరిగింద‌నే స‌మాచారం చంద్ర‌బాబుకు చేరింది. గొడ‌వ‌లు అయితే ముదిరి పాకాన ప‌డ్డాయి. మ‌రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుని.. ఇక్క‌డి ప‌రిస్థితిని చ‌క్క దిద్దుతారో చూడాలి.