ఎడమొహం పెడమొహంగా ఉండడమే కాకుండా. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ వర్సెస్ తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో ఆసక్తిక ఘటన చోటు చేసుకుంది. “కేసీఆర్ జీ ఆప్ ఆయియే” అంటూ.. మోడీ కార్యాలయం నుంచి కేసీఆర్‌కు వర్తమానం అందించింది. ఈ నెల 8న ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్‌లో బీజేపీ నిర్వహించనున్న సభలో కూడా ఆయన పాల్గొంటారు. వరంగల్‌లో నిర్వహించనున్న సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మోడీ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. తమకు తప్పక రావాలి! అని కూడా ఆహ్వానంలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అనేది సీఎం కేసీఆర్‌ను ఇరకాటంలోకి నెట్టింది.
ఇప్పటి వరకు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ 4 సార్లు హైదరాబాద్‌లో పర్యటించారు. అయితే.. ఏ ఒక్కసారికూడా కేసీఆర్ ఆయన ను రిసీవ్ చేసుకోలేదు. పైగా.. ఆయనతో మాట్లాడనూ లేదు. ఇక, ఇద్దరి మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. మోడీ ప్రభుత్వాన్ని దింపేస్తామని కేసీఆర్ అంటే.. బీఆర్ ఎస్‌కు ఓటు వేస్తే.. కేసీఆర్ కుమార్తె కవిత లాభపడతారు అంటూ.. ప్రధాని నిప్పులు చెరిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా మోడీ కార్యాలయం నుంచి కేసీఆర్‌కు ఆహ్వానం అందడం సంలచనంగా మారింది.
మరి ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా అనే దానిపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వస్తున్నారంటే.. కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికిన దాఖలాలు కూడా లేవు. జాతీయ పార్టీ ప్రారంభానికి ముందు నుంచే ప్రధాని తెలంగాణలో నిర్వహించే కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మోడీ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది చూడాలి.