ఇరుకున ప‌డుతున్న జ‌గ‌న్.. అదే జ‌రిగితే తీవ్ర న‌ష్టం?

ఏపీ సీఎం జ‌గ‌న్ ఇరుకున ప‌డుతున్నారా? కేంద్రంతో ఆయ‌న తెర‌చాటున చేతులు క‌లిపినా.. ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ముప్పురాలేదు. వ‌చ్చినా.. స‌రిచేసేందుకు స‌ర్ది చెప్పేందుకు సాయిరెడ్డి వంటి కీల‌క నాయ‌కులు ముందున్నారు. పార్టీని, ప్ర‌భుత్వాన్ని కూడా త‌మ వ్యూహాల‌తో కాపాడుకున్నారు. అయితే.. ఇప్పుడు పోయిపోయి.. జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది.

అదే.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఈ నెల‌లో పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్ట‌నున్న ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లుకు జ‌గ‌న్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం త‌ప్ప‌ని స‌రి అవుతోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఏడాది ఏపీలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారు మ‌ద్ద‌తు జ‌గ‌న్ కు ఎంతో కీల‌కంగా మార‌నుంది. దీంతో ఇష్టం ఉన్నా.. లేకున్నా.. ఆయ‌న ఉమ్మ‌డి పౌరస్మృతికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిన అవ‌స‌రం ఉంది.

అయితే.. ఈ బిల్లుకు మ‌ద్ద‌తు తెలిపితే.. జ‌గ‌న్‌కు కొంత వ‌ర‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఉమ్మ‌డి పౌర‌స్మృతిని ముస్లిం సామాజిక వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. త‌మ స్వేచ్ఛ‌, త‌మ మ‌తంపై జ‌రుగుతున్న దాడిగా పేర్కొంటున్న ఈ సామాజిక వ‌ర్గం జ‌గ‌న్‌పై ఆగ్ర‌హించే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇదే జ‌రిగితే..కొన్నేళ్లుగా ముస్లింలు జ‌గ‌న్‌కు అండ‌గా ఉంటున్న ప‌రిస్థితి తెర‌మ‌రుగు అయ్యే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఫ‌లితంగా రాష్ట్రంలో ముస్లింల ఓట్ల‌పై జ‌గ‌న్ నిర్ణ‌యం ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే.. ఇదే విష‌యంలో మ‌రోవైపు ఇత‌ర పార్ట‌లు సైతం.. మోడీ స‌ర్కారుకు జై కొట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని.. తాము ఒక్క‌రే కాకుండా.. అన్ని పార్టీలు ఉమ్మ‌డి పౌర‌స్మృతికి జై కొట్టిన నేప‌థ్యంలో త‌మకు ప్ర‌త్యేకంగా వ‌చ్చే ఇబ్బంది లేద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఏదేమైనా.. కీల‌క ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న ఈ ప్ర‌ధాన అంశంతో జ‌గ‌న్ కు ఇబ్బందులు అయితే.. త‌ప్ప‌వ‌నే ది మెజారిటీ విశ్లేష‌కుల అభిప్రాయంగా ఉంది.