హైకోర్టులో జగన్ సర్కారు కొత్త వాదన… ‘హోదా’తో రాజధానికి ముడి

ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల దిశగా జగన్ సర్కారు వడివడిగానే అడుగులు వేస్తుండగా.. సర్కారు స్పీడుకు బ్రేకులేసేందుకు అటు విపక్ష టీడీపీతో పాటుగా రాజధాని రైతులు తమదైన శైలి యత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం కూడా జగన్ సర్కారు మాటకే జైకొట్టగా… గురువారం నాడు జగన్ సర్కారు హైకోర్టులో ఓ కొత్త తరహా వాదనను వినిపించింది. అసలు ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాను కేంద్రం ఇప్పటిదాకా ఇవ్వనేలేదని చెప్పిన జగన్ సర్కారు… హోదా వచ్చేదాకా అసలు రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి అయినట్టుగా ఎలా భావిస్తారని కూడా తనదైన శైలి వాదనను వినిపించింది. అంతేకాకుండా రాజధాని అంశంపై సర్వాధికారాలు రాష్ట్రానివేనని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఇసుమంతైనా పాత్ర లేదని వాదించింది. ఇదే వాదనను ఇటీవలే స్వయంగా కేంద్రమే కోర్టుకు తెలిపిన విషయాన్ని కూడా జగన్ సర్కారు గుర్తు చేసింది.

ఈ మేరకు రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిదా? లేదంటే రాష్ట్రం పరిధిలోనిదా? అన్న విషయాన్ని తేల్చాలని దాఖలైన పిటిషన్ పై కొనసాగుతున్న విచారణలో భాగంగా గురువారం జగన్ సర్కారు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అనే విషయాన్ని కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాజధానితో సహా వివిధ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్షించే విస్తృత అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అందులో వివరించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల ప్రకారం రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి రానివని పేర్కొంది.

అంతేకాకుండా రాజధాని అంశానికి ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను ముడిపెడుతూ కూడా జగన్ సర్కారు ఓ సరికొత్త వాదనను వినిపించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్టే భావించాలని వెల్లడించింది. ప్రత్యేక హోదా గురించి ప్రతి మీటింగ్‌లో అడుగుతున్నామని తెలిపింది. హోదా అంశం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అపరిష్కృతి అంశమని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. కొద్దిరోజుల క్రితం పరిఫాలన వికేంద్రీకరణ సహా సీఆర్డీయే రద్దు బిల్లులను ఆమోదిస్తూ ఏపీ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించిన హైకోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. దీనిపై ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. రాష్ట్ర రాజధానులపై నిర్ణయం రాష్ట్రాలదే అని పేర్కొంది. ఈ అంశంలో కేంద్రం జోక్యం ఉండదని తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన తాజా అఫిడవిట్‌లో కేంద్రం ప్రస్తావించిన అంశాలను పొందుపర్చింది.