అమరావతిపై జగన్‌ సమీక్ష…ఏం జరుగుతోంది?

అమరావతి రాజధాని వ్యవహారం ఇపుడు ఏపీ, తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఏపీలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులపై వైసీపీ సర్కార్ మొగ్గు చూపుతుండగా….అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాదిగా అమరావతిలో నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అయితే, శాసన రాజధాని అయిన అమరావతిని కూడా మిగతా రెండు రాజధానుల మాదిరిగానే అభివృద్ధి చేస్తామని జగన్ సర్కార్ చెబుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా అమరావతిలోని పెండింగ్ నిర్మాణాల స్థితిగతులపై సీఎం జగన్ కొద్ది రోజుల క్రితం ఆరా తీశారు. అమరావతిపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోందని సంకేతాలిచ్చిన జగన్….తాజాగా, అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలో నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలు ఎన్ని.? నిర్మాణం ప్రారంభమయి మధ్యలో ఆగిపోయినవి ఎన్ని.? ఏయే భవనాల నిర్మాణం ఎక్కడిదాకా వచ్చింది.? వంటి అంశాలపై ఈ సమీక్షలో జగన్ చర్చించారని మంత్రి బొత్స చెప్పారు. అవసరమైతే అమరావతి డెవలప్ మెంట్ కోసం 10 వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని బొత్స ప్రకటించారు. అమరావతి చుట్టూ అనవసర రాద్ధాంతం జరుగుతోందనీ, అమరావతి అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ బొత్స చెప్పారు.

అమరావతిపై మొదటి నుంచి వైసీపీ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతి ముంపు ప్రాంతమని, శ్మశానమని, ‘కమ్మరావతి’ అని, హైమావతని పలువురు వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. ఇపుడు ఏడాది తర్వాత అమరావతిపై సమీక్ష నిర్వహించి….అభివృద్ధి చేస్తామని చెబుతున్నదీ ఇదే బొత్స అండ్ కో కావడం విశేషం. గత ఏడాదిగా అమరావతిలో పెండింగ్ నిర్మాణాలపై జగన్ సర్కార్ కొంచెమైనా ఫోకస్ చేసి ఉంటే…ఈ పాటికి అక్కడ కొంత డెవలప్ మెంట్ అయినా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం శాసన రాజధాని అని ప్రకటించిన తర్వాత అయినా…. అమరావతిపై ఫోకస్ చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇక, గత ప్రభుత్వం అమరావతి పేరుతో గ్రాఫిక్స్ మాయ చేసిందని విమర్శలు వచ్చాయి. ఈ ప్రభుత్వం ఏడాదిగా మౌనంగా ఉండి….ఇపుడు యాక్షన్ షురూ చేసింది. దీంతో, అమరావతిపై గత, ప్రస్తుత ప్రభుత్వాల చిత్తశుద్ధిపై జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

All the Streaming/OTT Updates you ever want. In One Place!