టికెట్ల ప్రకటనలో కర్నాటక ఫార్ములా

తొందరలోనే జరగబోతున్న తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కర్నాటక ఫార్ములా అనుసరించాలని డిసైడ్ అయినట్లుంది. టికెట్ల ప్రకటనలో కర్నాటకలో అనుసరించిన విధానాన్ని అనుసరిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని అనుకుంటున్నది. ఇంతకీ కర్నాటక ఫార్ములా ఏమిటంటే టికెట్లను రెండునెలల ముందే ప్రకటించేయటం. అవును కర్నాటకలోని 224 సీట్లలో విభేదాలు లేని నియోజకవర్గాల్లో రెండునెలలకు ముందే అధిష్టానం టికెట్లను ప్రకటించింది. దీనివల్ల జరిగిన లాభం ఏమిటంటే ప్రచారం చేసుకునేందుకు, ఎవరిలో అయినా అసంతృప్తులుంటే సర్దుబాటు చేసుకునేందుకు కావాల్సినంత సమయం దొరకటం.

అదే పద్దతిని తెలంగాణాలో కూడా అనుసరించాలని డిసైడ్ అయ్యింది. ఇక్కడున్న 119 నియోజకవర్గాల్లో దాదాపు 70 నియోజకవర్గాల్లో ఎలాంటి వివాదాలు లేవని తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో చాలామంది సీనియర్లు, సిట్టింగులే ఉన్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లకు పెద్దగా పోటీ కూడా లేదు. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో రెండునెలలకు ముందే టికెట్లను ప్రకటించేస్తే ఎలాంటి గొడవలు ఉండవని ఫీడ్ బ్యాక్ తీసుకుంది.

ఇక మిగిలిన 49 నియోజవర్గాల్లో కొన్నిచోట్ల ఇద్దరు, ముగ్గురు నేతలు టికెట్ కోసం పోటీపడుతున్నారు. వీళ్ళందరితో మాట్లాడి, బలాలు, బలహీనతలను చర్చించి, సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల్లో ఎవరికి అయితే గెలుపు ఛాన్సుందని రిపోర్టు వస్తుందో వాళ్ళకి టికెట్లు ఖరారుచేయాలనేది అధిష్టానం ఆలోచనగా ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల కోసం నేతలు పోటీలు పడుతున్నా ఇతర పార్టీలు అంటే ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీల నుండి వస్తారని అనుకుంటున్న నేతల కోసం రిజర్వు చేసుంచారట.

అంటే పోటీలు పడుతున్న నేతలున్న నియోజకవర్గాల్లోను, రిజర్వుచేసిన నియోజకవర్గాలపైన అధిష్టానం గట్టిగా దృష్టి తు పెట్టాల్సుంటుందని అర్ధమవుతోంది. ఈ నియోజకవర్గాలపైనే పీసీసీ కూడా ఒకటికి పదిసార్లు సర్వేలు చేయించుకుంటోంది. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాల్సిందే అని చాలా పట్టుదలగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇందుకు కర్నాటక ఎన్నికల్లో గెలుపు మంచి జోష్ ఇచ్చినట్లుంది. అందుకనే తెలంగాణాలో పార్టీ గెలుపుకు కర్నాటక ఫార్ములా అని పదేపదే చెబుతోంది. మరి టికెట్లకోసం గట్టిపోటీ ఉన్న నియోజకవర్గాల్లో అధిష్టానం ఎంపికపైనే గెలుపు అవకాశాలు ఆధారపడున్నట్లు అర్ధమవుతోంది, చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.