తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర పన్నారని… సతీమణి జమున సంచలన ఆరోపణలు చేశారు. అనూహ్యంగా మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ ఉందంటూ ఈటల సతీమణి నుంచి మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. శామీర్ పేటలోని తన నివాసంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంపై బోలెడన్ని అంచనాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈటల నిర్ణయానికి జస్టిఫికేషన్ ఇచ్చేందుకు జమున సిద్ధమవుతున్నట్లుగా వాదనలు వినిపించాయి.
కానీ.. ప్రెస్ మీట్ ఆరంభంలోనే ఆమె అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అక్కడితో ఆగని ఆమె.. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నట్లు తెలిసిందన్నారు. ఈటలను చంపేస్తామంటే మేం భయపడిపోమన్న ఆమె.. కౌశిక్ రెడ్డి మాటల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారంటూ మరో షాకింగ్ ఆరోపణకు తెర తీశారు. తమను తెలంగాణ ప్రజలు కాపాడుకుంటారని.. తమ కుటుంబం తెలంగాణ కోసం ఉద్యమించిందని.. తమకు తెలంగాణ ప్రజలు అండగా నిలుస్తారన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడ్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో హుజూరాబాద్ ప్రజలు.. కేసీఆర్ ఎన్ని డబ్బులు పంపించినా కూడా.. మద్యం సీసాలు పంపినా.. ఎంతమంది నాయకుల్ని కొనేసినా కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టి.. మంచి మెజార్టీతో గెలిపించారన్నారు. ఈ రోజున కేసీఆర్ ఒక చిల్లర.. పిచ్చికుక్క లాంటి ఆయన్ను చేరదీసి.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. హుజురాబాద్ ప్రజల మీదకు వదిలారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ.. ఆ పిచ్చికుక్క ఎన్నో ఆరాచకాలు చేస్తోందన్నారు. ‘కౌశిక్ రెడ్డిని.. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ప్రజలపైకి ఉసిగొల్పారు. ఆయన హుజూరాబాద్ లో ఆరాచకాలు చేస్తున్నారు.
మహిళల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. తల్లిదండ్రులు దగ్గర ఉన్నప్పుడు సంస్కారవంతంగా మాట్లాడే కౌశిక్ రెడ్డి.. ప్రగతిభవన్ కు వెళ్లిన తర్వాత మాత్రం కేసీఆర్ ఇలాంటి పిచ్చి మాటలు.. చేష్టలు చేస్తేనే నీకు ఎమ్మెల్సీని చేస్తానని చెప్పినట్లు ఉన్నారు. హుజురాబాద్ టికెట్ నీకే అన్న తర్వాత పిచ్చి చేష్టలు మరింత ఎక్కువ అయ్యాయి. అమరవీరుల స్తూపాన్ని కూలగొట్టించాడు. మా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా కేసీఆరే కారణం. బీజేపీలో ఈటల రాజేందర్ బాగున్నారు. వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. పార్టీ మారనని ఈటల రాజేందర్ ఇప్పటికే స్పష్టం చేశారు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం లేదు’’ అని జమున స్పష్టం చేశారు. తాజా వ్యాఖ్యలతో ఈటల బీజేపీలోనే కొనసాగుతున్నట్లుగా క్లారిటీ వచ్చినట్లుగా చెప్పొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates