రాజకీయాలలోకి వచ్చారంటే.. అన్నీ వదులుకుని రావాల్సిన పరిస్థితులు నేడు ఉన్నాయి. సిగ్గు, అభిమానం.. వంటివి అసలే ఉండకూడదు. ఎవరు ఏమన్నా భరించాలి.. అదే రేంజ్‌లో తిప్పికొట్టాలి. తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా అనే రాజకీయాలుకనిపిస్తున్నాయి. ఎవరు రాజకీయ గోదాలోకి దిగినా.. వీటికి సిద్ధమయ్యే రావాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఇవననీ తట్టుకోలేకే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. తాను అనలేనని, పడలేనని చెప్పేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నిర్వహిస్తున్నవారాహి యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తనను సుపారీ గ్యాంగ్‌తో అంతం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనికి ముందు 2019లోనే తనను చంపేయాలని ప్లాన్ చేశారని అన్నారు. ఇక, తనను కిరాయి ఇచ్చి మరీ తిట్టిస్తున్నారంటూ.. వ్యాఖ్యానించారు. తాజాగా.. మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను చేస్తున్న పోరాటంలో నా ప్రాణాలు పోయినా..”అని పవన్ చెప్పుకొచ్చారు. అయితే.. వాస్తవానికి కులాలు, మతాలు.. వివాదాలకు అతీతంగా మాట్లాడుకుంటే.. ఇప్పటి వరకు పవన్ దేనిపై పోరాటం చేశారు? ఎవరి కోసం పోరాటం చేశారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
2016లో కాకినాడలో సభ పెట్టినప్పుడు ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్.. దీనిపై పోరాడతానన్నారు. ప్రత్యేక హోదా ఎవరి సొత్తూ కాదని.. సాధించాలని చెప్పారు. కానీ, ఏమైంది. ఆయన ఎవరి మీద పోరాటం చేశారు. చివరకు ఏపీ ప్రజలకు చేవ లేదని తేల్చిచెప్పారు. ఇప్పుడు మాత్రం ఆయన తనకు తాను త్యాగానికి సిద్ధంగా ఉన్నానని.. “ఈ పోరాటంలో నేను బతికి ఉంటానో లేదో.. ” అని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది ఎన్నికల పోరాటమే తప్ప.. మరో పోరాటం కానేకాదు. ఎవరికి ఎవరు హాని చేసుకున్నా.. పొరుగున ఉన్న పార్టీకే ఫుల్లు డ్యామేజీ అనే చిన్న లాజిక్ అందరికీ తెలిసిందే.
సో.. అరిచి గీపెట్టుకున్నా ఎవరూ ఎవరినీ ఏమీ చేయలేరు. కొన్నాళ్ల కిందట టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళానికి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. దీంతో ఇది ప్రజల్లోకి వెళ్లి.. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్టు అర్ధమైంది. దీంతో వెంటనే ప్రభుత్వం పోలీసులను వెనక్కి రప్పించింది. అంటే.. రాజకీయంగా ఏం చేసినా.. ఇప్పుడు ఎన్నికల ముందు.. అధికార పార్టీకి డ్యామేజీ ఖాయమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం పవన్‌కు తెలియదా? అంటే.. తెలియదని అనుకోలేం. కానీ, ఆయన ఎందుకు ఇలా.. రోజుకో సంచలన వ్యాఖ్యతో ముందుకు వస్తున్నారనేది ఆసక్తిగా మారింది. కేవలం సింపతీ కోసమే అయితే.. పని జరుగుతుందా? పవన్ సింపతీ వ్యాఖ్యలకు ప్రజలు ఓట్లేస్తారా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates