ఒకప్పుడు కాపు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి.. కొన్నేళ్లుగా సైలెంటుగా ఉంటున్న ఆంధ్రా నేత ముద్రగడ పద్మనాభం కొన్ని రోజులుగా వార్తల్లో వ్యక్తిగా మారారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆయన రాసిన లేఖ పెద్ద చర్చకే దారి తీసింది.
కాపులకు పెద్దగా ఏమీ చేయని వైసీపీ వైపు నిలబడి.. పవన్‌ను టార్గెట్ చేయడం జనసైనికులకే కాక మెజారిటీ కాపు ప్రజానీకానికి కూడా నచ్చలేదు. లేఖలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని, జగన్ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ.. పవన్ మీద విమర్శలు గుప్పించడం మెజారిటీ జనానికి రుచించలేదు.
ముద్రగడ మీద మునుపెన్నడూ లేని స్థాయిలో వ్యతిరేకత కనిపించింది ఈ లేఖ తర్వాత. సామాజిక మాధ్యమాల్లో అయితే ముద్రగడ మీద నెటిజన్లు మామూలుగా విరుచుకుపడలేదు.
ఐతే పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ మీద మాట్లాడాలని.. ఆయన లేఖకు దీటుగా బదులు చెప్పాలని జనసైనికులు ఆశించారు. వారాహి యాత్రలో పవన్ ఈ పని చేస్తాడని ఆశించారు. కానీ పవన్ మాత్రం ముద్రగడను టార్గెట్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఆయన సీనియారిటీకి గౌరవం ఇచ్చి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు.
తాజాగా రాజోలు నియోజకవర్గంలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ మాట్లాడుతుండగా.. ఒక జనసైనికుడు ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా ఒక బేనర్ పట్టుకుని కనిపించాడు. అది పవన్ దృష్టిలో పడింది. పవన్ తన ప్రసంగాన్ని ఆపి.. ఆ బేనర్‌ను దించేయమని కోరాడు. పెద్దలు మనల్ని కొన్నిసార్లు కొన్ని మాటలు అంటారు. అంతమాత్రాన వాళ్లను మనం ఏమీ అనకూడదు, పెద్దల్ని గౌరవించాలి.. అంటూ ముద్రగడ పేరెత్తకుండానే తన హుందాతనాన్ని చాటుకున్నాడు పవన్. ఈ చర్య ప్రశంసలు అందుకుంటోంది.