జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన విమర్శలు పెను దుమారం రేపాయి. ఈ సందర్భంగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పవన్ ఉపయోగించిన భాషపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముద్రగడపై జనసేన, కాపు నేతలు ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ముద్రగడపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ పొలిటిషియన్ చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇన్ని రోజులు ముద్రగడపై తనకు సదభిప్రాయం ఉండేదని, ఈ రోజు పవన్ పై ఆయన రాసిన లేఖతో అది పోయిందని హరిరామజోగయ్య దుయ్యబట్టారు. పదవుల కోసం కాపు సామాజికవర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టేందుకు ముద్రగడ సిద్ధమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాపు ఉద్యమాన్ని ముద్రగడ నడిపారని ఈ లేఖతో తేటతెల్లమైందని చెప్పారు.
కాపు ఉద్యమాన్ని నేటితో ముద్రగడ గంగలో కలిపేశారని హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముద్రగడ మద్దతునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే హరిరామజోగయ్య వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.