కాపు ఉద్యమ మాజీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. వారాహి యాత్ర సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైరయ్యారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ… ఇప్పటి వరకు ఎంత మందికి నార తీశారో.. ఎంత మందిని కింద కూర్చోబెట్టారో.. ఎంత మంది బట్టలూడదీశారో చెప్పాలని సవాల్ రువ్వారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం పవన్‌కు లేఖాస్త్రం సంధించారు. అయితే.. ముద్రగడ వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కూనంపాటి శ్రీనివాసరావు అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు.
ముద్రగడ ఏమన్నారంటే…
వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారని.. అటువంటప్పుడు జనసేన పార్టీకి మద్దత్తు ఇవ్వాలని.. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎలా అడుగుతున్నారని ముద్రగడ ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలన్నారు. కలసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్వాస్పదమని ఎద్దేవా చేశారు.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దొంగ అయినప్పుడు రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలని పవన్‌కు ముద్రగడ సూచించారు. దుర్మార్గపు శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించాలని డిమాండ్ చేశారు. సత్తా చూపడానికి ముందుకు రావాలన్నారు. వారిని శాశ్వతంగా రాజకీయా ల నుండి తొలిగేలా చేయాలని తెలిపారు.
కాపు ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదన్నారు. “మీ ప్రసంగాలలో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి, కింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి” అంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
జనసేన కౌంటర్ ఇదీ..
ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత కూసంపూడి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఇతర పార్టీల నేతలు.. ముఖ్యంగా వైసీపీ నాయకులు జనసేనానిపై విమర్శలు చేసినప్పుడు మీరు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా విమర్శలు చేయాలని అనుకన్నప్పుడు… అన్ని సందర్భాల్లోనూ ఒకేలా స్పందించాలని సూచించారు. వైసీపీ చేస్తే.. ఒకవిధంగా జనసేన చేస్తే మరో విధంగా స్పందించడం .. కుట్ర రాజకీయాల్లో భాగమేనని దుయ్యబట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates