కాకినాడలో బిగ్ ఫైట్ తప్పదా ?

రాబోయే ఎన్నికల్లో జనాల దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో కాకినాడ కూడా ఒకటి. వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాన్ స్పీచ్ విన్నతర్వాత ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోయింది. కాకినాడ వైసీపీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి పవన్ తో ఏదో గట్టుతగాదా ఉన్నట్లుంది. అందుకనే చాలాకాలంగా ద్వారంపూడి పై పవన్ టార్గెట్ పెట్టున్నారు. అయితే ఇంతకాలం ఆరోపణలకు మాత్రమే పవన్ పరిమితమయ్యారు. సమయం, సందర్భం ఉన్నా లేకపోయినా ఎంఎల్ఏలపైన పవన్ నోటికొచ్చింది మాట్లాడుతునే ఉన్నారు.

అలాంటిది వారాహియాత్రలో ఎంఎల్ఏని పవన్ పదేపదే టార్గెట్ చేస్తునే ఉన్నారు. ప్రత్తిపాడు, పిఠాపురంలో కూడా చూచాయగా మాట్లాడి వదిలేశారు. అలాంటిది కాకినాడలోనే జరిగిన సభలో మాత్రం ఫుల్లుగా ఫైరైపోయారు. ఇక్కడ గంటన్నరపాటు పవన్ మాట్లాడితే అందులో గంటసేపు ద్వారంపూడి గురించే మాట్లాడారు. ఎంఎల్ఏపైన ఆరోపణలు, విమర్శలు, చాలెంజులతో పవన్ రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి ఎలా గెలుస్తారో చూస్తానంటు చాలెంజ్ చేశారు.

ఏదేమైనా పవన్ టార్గెట్ చూసిన తర్వాత కాకినాడ నియోజకవర్గంలో బిగ్ ఫైట్ తప్పేట్లు లేదని అర్ధమవుతోంది. మరి రాబోయే ఎన్నికల్లో కాకినాడలో జనసేన పోటీచేస్తుందా లేకపోతే పొత్తులో టీడీపీకి వదులుకుంటుందా అన్నదే తెలీదు. టీడీపీతో పొత్తుంటుందని పవన్ ఒకసారి ఇంకా ఆలోచించలేదని మరోసారి చెప్పటంతో అయోమయమైతే పెరిగిపోతోంది. కాబట్టి ముందు పొత్తుల అయోమయాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ద్వారంపూడి ఆర్ధిక, అంగ బలాలు పుష్కలంగా ఉన్న నేత. పైగా లోకల్ గా వివిధ సామాజికవర్గాల్లో బాగా పట్టున్న ఎంఎల్ఏ. కాబట్టి ద్వారంపూడిని ఓడించటం అంత ఈజీకాదు.