కాంగ్రెస్ కు ఆప్ బంపరాఫర్

రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీని ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్షాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 20 పార్టీలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అంటే వీటిమధ్య పొత్తులు కుదిరిందని అర్ధంకాదు. ఈనెల 23వ తేదీన ప్రతిపక్షాలతో పాట్నాలో భేటీని ఏర్పాటుచేశారు. ఆ భేటీకి పార్టీల అధినేతలను మాత్రమే రావాలని షరతుపెట్టారు. అందుకు చాలాపార్టీలు అంగీకరించాయి కూడా.

ఈ నేపధ్యంలోనే ఆప్ జాతీయ ప్రతినిధి, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతు కాంగ్రెస్ కు బంపరాఫర్ ఇచ్చారు. అదేమిటంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పంజాబ్, ఢిల్లీలో గనుక కాంగ్రెస్ అభ్యర్ధులను పోటీకి దించకపోతే మధ్యప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో తాము పోటీకి దూరంగా ఉంటామని చెప్పారు. తమ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకారమైతే తాము చర్చలు జరపటానికి సిద్ధంగా ఉన్నట్లు భరద్వాజ్ చెప్పారు. అయితే భరద్వాజ్ ఆపర్లో కొంచెం క్లారిటి మిస్సయినట్లు అనిపిస్తోంది.

అదేమిటంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో దూరంగా ఉండాలన్నంత వరకు అర్ధమవుతోంది. అందుకుగాను మధ్యప్రదేశ్, రాజస్ధాన్ ఎన్నికలకు ఆప్ దూరంగా ఉంటుందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్ ఎన్నికలకు దూరమంటే ఈ ఏడాది చివరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ దూరంగా ఉంటుందా ? లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పై రెండు రాష్ట్రాల్లో ఆప్ దూరంగా ఉంటుందా ?

ఇక్కడ ఇంకో క్లారిటి కూడా అవసరమే. అదేమిటంటే మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో ఆప్ బలమెంత ? మొన్నటి పంజాబ్ ఎన్నికలను ఆప్ స్వీప్ చేసుండచ్చు కానీ కాంగ్రెస్ బలమైన పార్టీయే. ఇక ఢిల్లీలో కూడా కాంగ్రెస్ బలమైన పార్టీఅనే చెప్పాలి. 15 ఏళ్ళు ఏకధాటిగా ఢిల్లీని కాంగ్రెస్ ఏలిన విషయం మరచిపోకూడదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. పంజాబ్, ఢిల్లీలో కాంగ్రెస్ కు బలమున్నట్లే మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో ఆప్ కు అంత బలముందా ? ఆప్ బలమైన పార్టీ అయితేనే భరద్వాజ్ ఇచ్చిన ఆఫర్ ను కాంగ్రెస్ ఆలోచిస్తుంది. లేకపోతే పట్టించుకోదు. దానికన్నా పొత్తులంటే ఎక్కువ ఆలోచిస్తుందేమో.