పవన్ వారాహి యాత్రలో అనుకోని ప్రమాదం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి వారాహి పాదయాత్రను ఈరోజు నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన పవన్ ఆ తర్వాత కత్తిపూడిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను చూసేందుకు, వారాహి యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తిపూడికి తరలివచ్చారు.

ఈ నేపథ్యంలోనే పవన్ వచ్చే మార్గంలో వేలాది మంది అభిమానులు ఆయనను చూసేందుకు బారులు తీరారు. ఈ నేపథ్యంలోనే పవన్ పర్యటనలో అపశృతి జరిగింది. కత్తిపూడిలోని బహిరంగ సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన లైట్ స్టాండ్ పైనుంచి కిందపడి ఒక అభిమాని తీవ్ర గాయాలపాలయ్యాడు. పవన్ ను సమీపం నుంచి చూడాలన్న ఆతృతలో కొందరు యువకులు లైట్ స్టాండ్ పైకి ఎక్కారు.

అయితే లైట్ స్టాండ్ పై తోపులాట జరగడంతో ఓ యువకుడు కింద ఉన్న కరెంటు తీగలపై పడ్డాడు. అప్రమత్తమైన మిగతా యువకులు వెంటనే గాయపడ్డ యువకుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కావడానికి ముందే అపశృతి జరగడంతో జనసైనికులు కొందరు ఆందోళన చెందుతున్నారు. గతంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ముందు కూడా సినీ నటుడు, టీడీపీ నేత తారక రత్న హఠాత్తుగా కుప్పకూలిపోవడం, ఆ తర్వాత నెలన్నర పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందడం తెలిసిందే.