జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నవరం నుంచి వారాహి యాత్ర మొదలుబెట్టారు. కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారాహి వాహనం పై నుంచే నిలుచొని పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ పై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును సీఎం చేసేందుకే తాను వారాహి యాత్ర చేస్తున్నాన్న విమర్శలను పవన్ తిప్పికొట్టారు.
తాను సీఎం పదవి కావాలనుకోవడం లేదన్న ప్రచారాన్ని పవన్ ఖండించారు. తాను ఒంటరిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో నిర్ణయించుకోలేదని, సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతానని పవన్ శపథం చేశారు. అందుకు ఎన్ని వ్యూహాలైనా రచిస్తానని, సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని క్లారిటీనిచ్చారు. అందుకు ఏం చేయాలన్న అంశంపై మాట్లాడుకుందాం అని జనసైనికులనుద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.
ప్రజల భవిష్యత్తు కోసం. తన పిల్లల భవిష్యత్తును కూడా వదిలేసి వచ్చానని పవన్ అన్నారు. చేగువేరా పుట్టినరోజు. నాడు యాదృచ్ఛికంగా వారాహి యాత్ర ప్రారంభమైందని చెప్పారు. తనను పరిపాలించే వాడు తనకంటే నిజాయతీపరుడై ఉండాలని పవన్ అన్నారు. సీఎం అవినీతి చేస్తే ఎవరు పట్టుకోవాలి అని జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను అసెంబ్లీకి రాకూడదని అందరూ కక్షగట్టి ఓడించారని, భీమవరం ఓట్ల జాబితాలో 8 వేల ఓట్లు అదనంగా పోలయ్యాయని ఆరోపించారు.
జగన్ ప్రమాణ స్వీకారం రోజు ఆయనకు ఫోన్ లో ఒక్కటే చెప్పానని, సహేతుకమైన విమర్శలు చేసే ప్రతిపక్షంగా ఉంటానని చెప్పానని గుర్తు చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి మాట్లాడింది మొదలు ఇప్పటి వరకు తనతో సహా తన నాలుగేళ్ల బిడ్డ వరకు అందరినీ వైసీపీ నేతలు తిడుతున్నారని, వైసీపీ అంత నీచంగా తయారైందని మండిపడ్డారు.
వైసీపీ నేతల పర్సనల్ విషయాలు తనకూ తెలుసని, అభిమానులే తన ఇంటెలిజెన్స్ అని అన్నారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో తాను ఒకడిని అని, ప్రజల కోసమే ఇలాంటి మాటలు పడుతున్నానని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates