టీ కాంగ్రెస్ లో డీకే కీలక పాత్ర ?

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంతో డీకే జాతీయస్ధాయిలో బాగా పాపులర్ అయిపోయారు. ఇపుడు కాంగ్రెస్ రాజకీయాల్లోనే కాకుండా ఇతర పార్టీల్లో కూడా డీకే శివకుమార్ అంటే మంచి క్రేజ్ వచ్చింది. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో డీకే పడిన కష్టం అంతా ఇంతాకాదు. అలాంటి డీకేని అధిష్టానం తెలంగాణా ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని ఆదేశించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

ప్రస్తుతానికి డీకే మంత్రాంగమంతా ఫోన్లమీదే నడుస్తోందట. అవసరమైన నేతలు బెంగుళూరుకు వెళ్ళి డీకే కలిసొస్తున్నారట. ఇప్పటికి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రెండుసార్లు బెంగుళూరు వెళ్ళి డీకేని కలిశారట. అలాగే తొందరలోనే పార్టీలో చేరబోతున్న పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూడికుళ్ళ దామోదరరెడ్డి కూడా డీకేతో ఫోన్లో మాట్లాడుకున్నట్లు సమాచారం. డీకేనుండి వచ్చిన హామీల మేరకే వీళ్ళ ముగ్గురు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారట.

కర్నాటకలో గెలుపుకు అనుసరించిన ఫార్ములానే తెలంగాణాలో కూడా అప్లై చేయాలని అధిష్టానం డీకేతో చెప్పిందట. కర్నాటక ఫార్ములాలో కీలకమైన పాయింట్లున్నాయి. అవేమిటంటే డీకే-సిద్ధరామయ్య సఖ్యతగా ఉండటం. నిజానికి వీళ్ళిద్దరి మధ్య బాగా వివాదాలున్నాయి. అయితే పార్టీని అధికారంలోకి తేవటమే లక్ష్యంతో విభేదాలను పక్కనపెట్టి ఒకటిగా పనిచేశారు. అలాగే అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం అంతా చాలా జాగ్రత్తగా చేసుకున్నారు. అలాంటి ఫార్ములానే తెలంగాణాలో కూడా అప్లై అయ్యేట్లు చూడాల్సిన బాధ్యతను అధిష్టానం డీకే మీదుంచినట్లు సమాచారం.

ఇప్పటివరకు తెరవెనుక పాత్రనే పోషిస్తున్న డీకే తొందరలోనే తెర ముందుకు రాబోతున్నారట. అంతా బాగానే ఉంది కానీ డీకే చెబితే తెలంగాణా సీనియర్లు మాట వింటారా ? అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే తమ అవసరాల కోసం, మాట చెల్లించుకోవటం కోసం పార్టీ ప్రతిష్టను కూడా ఫణంగా పెట్టేసే నేతలు చాలామందే ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు పార్టీని దెబ్బకొట్టడానికైనా సిద్ధపడతారే కానీ రేవంత్ తో కలిసి పనిచేయటానికి ఇష్టపడరు. మరిలాంటి వాళ్ళని డీకే అయినా అధిష్టానమైనా ఏ విధంగా దారికి తీసుకొస్తుందో అనే విషయం ఆసక్తిగా ఉంది.