తెలంగాణలో నెల కిందట్నుంచి రోజూ వెయ్యికి తక్కువ కాకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందులో మెజారిటీ హైదరాబాద్ పరిధిలోనివే. ఈ మధ్య అయితే రోజూ హైదరాబాద్ పరిధిలోనే 1000-1500 మధ్య కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ సంఖ్య ఎంతకీ తగ్గట్లేదు. మరణాల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉంటోంది.
ప్రభుత్వం అటు ఇటుగా రోజుకు 10 మరణాలంటోంది కానీ.. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఆ నంబర్ ఎక్కువే అని మీడియా పరిశీలనలో వెల్లడైంది. తెలంగాణలో, హైదరాబాద్‌లో కరోనా తగ్గుముఖం పడుతున్న సూచనలైతే ఎంతమాత్రం కనిపించడం లేదు. జనాలు కూడా కరోనాకు బాగా అలవాటు పడిపోయినట్లు కనిపిస్తోంది.
ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం తరఫున ఆసక్తికర ప్రకటనలు చేశారు. ఈ నెల చివరికల్లా హైదరాబాద్‌లో కరోనా అదుపులోకి వచ్చేస్తుందని.. సెప్టెంబరు చివరికల్లా రాష్ట్రమంతటా కరోనా కంట్రోల్ అయిపోతుందని ఆయనన్నారు. ఈ ప్రకటన ఆశలు రేకెత్తించేదే కానీ రోజువారీ కేసులు, మరణాల తీరు చూస్తుంటే మాత్రం అలాంటి ఆశ, అంచనా ఎంతమాత్రం కనబడటం లేదు.
మరి ఏ ప్రామాణికతతో ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయించిందో తెలియదు. పరిస్థితులు చూస్తుంటే మరికొన్ని నెలలు కరోనా విజృంభణ తప్పేలా లేదు. హెర్డ్ ఇమ్యూనిటీ అయినా రావాలి. లేదా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి అయినా కరోనా నియంత్రణ జరగాలి. అంతే తప్ప ఈ నెలలోనో.. వచ్చే నెలలోనో కరోనా అదుపులోకి వస్తుందంటే మాత్రం నమ్మశక్యంగా లేదు.