కరోనా కేసుల సంఖ్య.. మరణాల లెక్కలు చూసి వామ్మో అనుకునే రోజులు పోయాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు వంద కేసులు నమోదయ్యాయి.. ఐదారుగురు చనిపోయారు అంటేనే చాలా భయపడిపోతూ మాట్లాడుకునే వాళ్లం కానీ ఇప్పుడు వేలల్లో కేసులు.. పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణలో వాస్తవ కేసులు, మరణాల లెక్కల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇక్కడితో పోలిస్తే ఐదారు రెట్ల సంఖ్యలో కేసులుంటున్నాయి. మరణాలైతే మరీ ఎక్కువగా ఉన్నాయి. గత మూణ్నాలుగు రోజుల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది.
వారం నుంచి ఏపీలో ప్రతి రోజూ అటు ఇటుగా పది వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య 70, 80, 90 ప్లస్ ఇలా ఉంటోంది. శని, ఆదివారాల్లో రెండు రోజులూ కేసుల సంఖ్య 90 దాటి వందకు చేరువగా వచ్చింది. ఆదివారం మరణాల సంఖ్య 97 కావడం గమనార్హం.
ఒక్క రాష్ట్రంలో దాదాపు వంద మరణాలంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా జిల్లాల్లో అటు ఇటుగా పది మంది దాకా కరోనాతో మరణిస్తున్నారు. టోటల్ నంబర్ చెబితే జనాలు భయపడతారనో ఏమో.. అలా కాకుండా కరోనా బులిటెన్లో జిల్లాల వారీగా మరణాల లెక్కలు ఇచ్చి కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కారు. ఇలా నిలకడగా రోజూ పది వేల కేసులు, వంద దాకా మరణాలు అంటే.. ఇంకెప్పుడు అక్కడ కరోనా అదుపులోకి వస్తుందో మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates