ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తామని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. జూన్ రెండో వారం నుంచి వారాహిని లైన్‌లో పెట్టనున్నారు. రెండో వారం నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ వారాహి వాహనంలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
ఆయా జిల్లాల్లోని ప్రధాన కూడళ్లు, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసే సభల్లో పవన్ ప్రసంగిస్తారు. ఈ నెల 14 నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అన్నవరం దర్శనం తర్వాత పత్తిపాడు నుంచి యాత్ర మొదల వుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన కల్పించేలా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. స్థానికుల నుంచి సమస్యలపై పవన్ అర్జీలు తీసుకుంటారని, సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఆయన పర్యటిస్తారని పేర్కొన్నారు.
తూర్పుపైనే ప్రత్యేక దృష్టి
తూర్పుగోదావరి జిల్లాపై పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని నాదెండ్ల చెప్పారు. సినిమాల పరంగా ఇచ్చిన కమిట్‌మెంట్లు పూర్తి అయితే.. ప్రజల్లోనే పవన్ ఉంటారని పేర్కొన్నా రు. పవన్ సభలు, రోడ్ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న ఉదంతాలు ఎదురవుతుండడంతో వారాహి వాహనంపైనా.. చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు.
ఇక, వేలమందికి స్పష్టంగా వినిపించేలా అధునాతనమైన సౌండ్ సిస్టమ్‌ను వాహనంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే, భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్ ప్రత్యేక సర్వర్‌కు రియల్ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇక, వాహనం లోపల పవన్‌తో పాటు మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు, వాహనం లోపలి నుంచి పైకి వెళ్లడానికి హైడ్రాలిక్ మెట్లు ఉంటాయి. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి.