పార్టీకి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి పెద్ద తలనొప్పిగా తయారైనట్లే ఉన్నారు. చీటికి మాటికి అలగటం, జగన్మోహన్ రెడ్డి అటెన్షన్ తనపైన ఉందని పదిమందికి చాటుకోవటమే బాలినేని టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. అందుకనే ఏదో కారణంతో పార్టీపైన అలుగుతున్నారు. దీనివల్ల బాలినేని వచ్చే లాభం ఏమిటో తెలీదు కానీ పార్టీకి మాత్రం చిక్కాగ్గా ఉంది. బాలినేని అలగటం నేతలను పంపించి బుజ్జగించటం లేకపోతే చివరకు తానే రంగంలోకి దిగాల్సి రావటం జగ న్ కు పెద్ద చికాకుగా మారింది.
మే నెలలో అలగటం మీదే బాలినేని పిలిపించుకుని జగన్ రెండుసార్లు మాట్లాడారు. మళ్ళీ ఈరోజు మూడోసారి పిలిపించుకుంటున్నారు. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో జగన్ తో బాలినేని భేటీ అవుతున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ తో తనకున్న బంధుత్వం ప్రపంచానికంతా తెలియాలన్నది బాలినేని ఉద్దేశ్యంగా కనబడుతోంది. నిజానికి జగన్ తో బాలినేనికి డైరెక్టుగా బంధుత్వం లేదు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి బాలినేని స్వయాన బావమరిది అవుతారు.
సుబ్బారెడ్డికి బావమరిది కాబట్టి జగన్ కు కూడా బంధువయ్యారు. ఈ బంధుత్వం కారణంగానే గతంలో దివంగత ముఖ్యమత్రి వైఎస్సార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే బంధుత్వాన్ని అడ్డంపెట్టుకుని చీటికిమాటికి అలగటంతో చివరకు మొదటికే మోసం అయిపోతారేమో అనే ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. ఏవో గట్టు తగాదాల కారణంగా సుబ్బారెడ్డితో బాలినేనికి చెడింది. అప్పటినుండి ఇద్దరు ఉప్పునిప్పులాగ తయరయ్యారు.
దాంతో ఇద్దరు కూడా ఒకరిని దెబ్బకొట్టుకునేందుకు మరొకళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒక్కోసారి ఒక్కోకళ్ళు సక్సెస్ అవుతున్నారు. మంత్రిపదవిలో నుండి తనను తప్పించటాన్ని బాలినేని అవమానంగా భావిస్తున్నారు. దాన్ని తట్టుకోలేక పార్టీలో నానా గోలచేస్తున్నారు. బాలినేని ఇదే విధంగా కంటిన్యు అయితే చివరకు రేపటి ఎన్నికల్లో టికెట్ దక్కేది కూడా అనుమానమే అని అంటున్నారు. జగన్ కు చిర్రెత్తనంతవరకే ఎవరినైనా భరిస్తారని ఒకసారి చికాకు మొదలైతే సదరు నేత చాప్టర్ క్లోజ్ అని పార్టీలో టాక్ నడుస్తోంది. మరి బాలినేని ఎంతవరకు వ్యవహారాన్ని తెచ్చుకుంటారో చూడాల్సిందే.