సిక్కుల పై జగన్ ఫోకస్ !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కులాల వారీగా.. మ‌తాల వారీగా విడిపోతున్న ఓటు బ్యాంకుకు ఇప్పుడు మ‌రో చేరిక వ‌చ్చింది. సీఎం జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా కులాల‌ను మ‌రింత‌గా త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాష్ట్రంలో సిక్కు మ‌త‌స్తుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో  భాగంగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆయా వర్గాల వారితో భేటీ నిర్వ‌హించ‌డం సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు.. వారిపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. దీంతో సిక్కుల విష‌యం రాష్ట్రంలో తొలిసారి రాజ‌కీయ ప‌ర‌మైన పోల‌రైజేష‌న్‌కు జ‌గ‌న్ నాంది ప‌లికిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

వాస్త‌వానికి రాష్ట్రంలో సిక్కుల ఓటు బ్యాంకు 2-4 శాతం ఉంది. అంటే.. వంద‌మందిలో ఇద్ద‌రు నుంచి న‌లుగురు మాత్ర‌మే వారు ఉన్నారు. మ‌రి వీరి ఓటు బ్యాంక‌పై ఇప్ప‌టి వ‌రకు కూడా ఎవ‌రూ దృష్టి పెట్ట‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో సిక్కుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసిన‌.. చంద్ర‌బాబు.. మ‌ధ్య‌లోనే విర‌మించుకున్నారు. విజ‌య‌వాడ‌, గుంటూరు, విశాఖ‌, తిరుప‌తి, విజ‌య‌న‌గ‌రం వంటి కొన్ని ప్రాంతాల్లోనే సిక్కులు ఉన్నారు.

వారు కూడా ఆటోమొబైల్‌, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉన్నారు. దీంతో ఎందుకో గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా.. మ‌ధ్య‌లోనే వ‌దిలేశారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు సిక్కులు ఏపార్టీకి ఓటు వేస్తున్నారు? అనే అంచ‌నాలు ఎవ‌రికీ లేవు. పైగా.. వారుపోలింగు బూత్‌ల‌కు వ‌స్తున్న జాడ కూడా క‌నిపించ‌లేదు. కానీ, తొలిసారి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈ వ‌ర్గం వారిపై దృష్టి పెట్టారు. అయితే.. ఇది కేవ‌లం .. సిక్కుల‌కు ఉద్దేశించిందేనా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎందుకంటే.. రాష్ట్రంలో ఉన్న సిక్కులు.. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చారు. సో.. వారు ఆయా రాష్ట్రాల‌కు చెందిన వ‌ల‌స ప్ర‌జ‌ల ఓట్ల‌ను కూడా ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌నేది జ‌గ‌న్ భావ‌న కావొచ్చు. అందుకే వారు కోరిన వాటికి వెంట‌నే ఆమోదం తెలిపారు. ప్ర‌ధానంగా గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు, గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు… నెల‌నెలా పింఛ‌న్లు,  గురునానక్‌ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించడం గ‌మ‌నార్హం.

 మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించ‌డం వంటి సిక్కుల‌ను ఆకర్షించే ప్ర‌ధాన అస్త్రాలుగా మారాయి. ప్ర‌తి ఓటు కీల‌క‌మైన వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి వీరి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూరుతుందో చూడాలి. అయితే.. ప‌రిశీల‌కులు మాత్రం ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. రాష్ట్రంలో మ‌రింత‌గా కులాలు.. మ‌తాల వారీగా ప్ర‌జ‌లు విభ‌జ‌న జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాద‌ని అంటున్నారు.