మొదలవుతున్న ఆపరేషన్ ‘ఘర్ వాపసీ’

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలవబోతోంది. బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్త నేతలను బయటకు రప్పించేందుకు ప్రయత్నాలతో స్పీడ్ పెంచింది. ఘర్ వాపసీ కార్యక్రమం రెండు విధాలుగా ఉండబోతోంది. మొదటిదేమో కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించటం. ఇక రెండో పద్దతి ఏమిటంటే బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్తిగా ఉన్ననేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవటం. విషయం ఏదైనా, పేరేదైనా పార్టీని బలోపేతం చేసుకుని వచ్చేఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావటమే టార్గెట్.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించటంతో తెలంగాణా నేతల్లో కూడా అధికారంలోకి వచ్చేవిషయమై జోష్ పెరిగింది. తమ మధ్య ఉన్న సమస్యలను పక్కనపెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విషయమై ఏకతాటిపైకి రావాలని అధిష్టానం కూడా పదేపదే చెబుతోంది. ఇందుకోసం అధిష్టానం తరపున ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. విభేదాలున్న నేతలను కూర్చోబెట్టి రాజీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటక ఫార్ములానే తెలంగానాలో కూడా అప్లై చేస్తే గెలుపు ఖాయమని అనుకుంటున్నది.

రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవకపోతే పార్టీ మనుగడే కష్టమైపోతుందన్న విషయం సీనియర్లకు వివరిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రెండు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.  అందుకనే పార్టీని కాదని బీఆర్ఎస్ లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి,  గడ్డం వివేక్ తదితరులతో మాట్లాడేందుకు సీనియర్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఈటల రాజేందర్ తో కూడా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

నిజానికి  కాంగ్రెస్ లోనే చేరాల్సిన ఈటల వివిధ కారణాల వల్ల బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని గుర్తు చేసి కాంగ్రెస్ లోకి లాక్కోవాలని చూస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ లో బలమైన నేతలుగా ఉన్న వారిని కూడా కాంగ్రెస్ లోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గనుక కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఇతర నేతలు కూడా కాంగ్రెస్ లోకి వెంటనే వచ్చే అవకాశాలుంటాయని అనుకుంటున్నారు. అందుకనే వీళ్ళిద్దరిని  ఈ వారంలోనే పార్టీలోకి చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మొదటివారంలో కాంగ్రెస్  ఘర్ వాపసీ స్పీడందుకుంటుందా ?