నారా లోకేష్ నోరు జారారా.. జాగ్ర‌త్త ప‌డ్డారా?

రాజ‌మండ్రిలో జ‌రిగిన మ‌హానాడు వేదిక‌పై చాలా మంది నాయ‌కులు మాట్లాడారు. అయితే.. కొంద‌రు మాట్లా డిన తీరు.. వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలాంటి వారిలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సొంత పార్టీలోనే చ‌ర్చ‌కు దారితీశాయి. ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌ను నారా లోకేష్ చ‌ర్చించారు. ఒక‌టి.. టికెట్ల‌పై ఆశ పెట్టుకోకుండా ప‌నిచేయాల‌ని. రెండు వైసీపీ నుంచి ఎవ‌రు వ‌చ్చినా.. తీసుకునేందుకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేమ‌ని!

ఈ రెండు విష‌యాల‌ను చాలా సీరియ‌స్‌గానే ఉన్నాయి. ఎందుకంటే..ఇప్ప‌టి వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో పార్టీ జెండా మోసి, వివిధ కార్య‌క్ర‌మాల‌కు నిధులు సైతం వెచ్చించిన నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఆశిస్తున్నారు. వీరిలో పార్టీలో సొంత‌గా ఎదిగిన నాయ‌కులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే.. వీరికి మ‌హా నాడు వేదిక‌గా సాంత్వన వ‌చ‌నాలు.. అదేస‌మ‌యంలో కీల‌క హామీలు ద‌క్కుతాయ‌ని ఆశించారు. కానీ, నారా లోకేష్ టికెట్ల‌పై తేల్చేశారు.

ఎవ‌రూ టికెట్ లు ఆశించ‌వ‌ద్ద‌ని.. తాను ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని.. చంద్ర‌బాబు చూసుకుంటార‌ని అన్నారు. దీంతో కొంద‌రు నాయ‌కులు నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఇక‌,రెండోది.. వైసీపీ నుంచి వ‌చ్చే నాయ కుల విష‌యం. ఇటీవ‌ల కాలంలో టీడీపీ నాయ‌కులు స్వ‌యంగా చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే చేరేందుకు రెడీ అవుతున్నార‌ని.. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు వ‌చ్చేస్తున్నార‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు.

ఇక‌, టీడీపీ అనుకూల మీడియాలోనూ వైసీపీ ఖాళీ అయిపోతోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి ఇలాంటి స‌మ యంలో అనూహ్యంగా నారా లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నమ‌నే చెప్పాలి. వైసీపీ నుంచి వ‌చ్చే వారిని చేర్చుకునేది లేద‌ని.. వ‌చ్చినా టికెట్లు ఇచ్చేది లేద‌ని చెప్ప‌డం ద్వారా నారా లోకేష్ జాగ్ర‌త్త ప‌డ్డారా?  లేక తొంద‌ర ప‌డ్డారా? అనే చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే.. వ‌చ్చేవారు కూడా ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో దూర‌మ‌వుతారు. త‌మ దారి తాము చూసుకుంటారు. మ‌రి ఏ వ్యూహంతో నారా లోకేష్ ఈ కామెంట్లు చేశారో చూడాలి.